వనపర్తి: రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గురువారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. ఎన్నికల అధికారిగా డీపీఓ రఘునాథరెడ్డి వ్యవహరిస్తున్నారు. తుది ఓటరు జాబితాలో పేరున్న వారు మాత్రమే సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు పోటీలో ఉండాల్సి ఉంటుంది. లేఫ్ అసోసియేట్ సభ్యులు మినహా.. మిగతా మూడు కేటగిరీల్లోని శాశ్వత సభ్యులు, ప్యాట్రన్ సభ్యులు, వైస్ ప్యాట్రన్ సభ్యులు మాత్రమే పోటీ చేసేందుకు అర్హత ఉంటుంది. రూ.10 వేల నగదు డిపాజిట్‌తో పాటు నామినేషన్ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఇద్దరు మద్దతుదారులు ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది.
రైతు సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యం
అమరచింత: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. ప్రతిపక్షాలు రైతుల పేరిట రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్‌గౌడ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు బుధవారం జూరాల ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల సాగునీటి సమస్యలను మంత్రి వాకిటి శ్రీహరి సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కర్ణాటక సీఎంతో మాట్లాడి ఎగువ నుంచి నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. ఆయకట్టు రైతుల పంటలు కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. బీఆర్‌ఎస్, బీజేపీల లేనిపోని ఆరోపణలు రైతులు నమ్మొద్దని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జూరాల ఆయకట్టును ఎండనివ్వమని, సాగునీరు అందించి కాపాడుతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవికాంత్, జింక రవి, చుక్కా ఆశిరెడ్డి, వెంకట్‌రెడ్డి, నందిమళ్ల ఉపసర్పంచ్ శ్రీధర్, గణేష్‌గౌడ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అన్యాయం చేస్తే సహించబోం
ఆత్మకూర్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకుందని.. సాగునీరు అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం పట్టణంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి ప్రాజెక్టులు, నీటి సామర్థ్యాలపై కనీస అవగాహన లేదని.. పండిన పంటలకు ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని సాగునీరు ఇవ్వకూడదని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరా లేక బోర్లకింద పంటలు ఎండిపోతున్నాయని.. ప్రాజెక్టుల్లో నీరున్నా ఇవ్వకుండా మొండికేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలకు రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల జలాశయంలో సమృద్ధిగా నీరున్నప్పటికీ పంటలకు వదలకుండా కర్ణాటకకు వెళ్లి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రధాన ఎడమకాల్వకు నీటి విడుదల రైతుల విజయమని.. నిరంతరం అండగా ఉంటామని, తేడా వస్తే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో విండో అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీను, విరేశ లింగం, మాజీ చైర్‌పర్సన్ గాయత్రి, మాజీ వైస్ ఎంపీపీ కోటేష్, నాయకులు రామకృష్ణ, చెన్నయ్య, మాసన్న, రియాజ్ అలీ, కొత్తబోయ శేఖర్, అనీల్, మాసన్న, పుట్నాల రమేష్, రాజ్‌కిరణ్, జానకిరాం, గోపన్‌పేట అంజి, తోట రవి తదితరులు పాల్గొన్నారు
్డ


