వనపర్తి: రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్తకొత్త ఆలోచనలు, సాంకేతిక మేళవింపుతో రైతులు పంటలు సాగు చేయాలని.. అప్పుడే లాభాలు ఆర్జిస్తారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని ఓ గార్డెన్స్‌లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌మేళా–2026కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేళాలో వివిధ కంపెనీలు తాము రూపొందించిన మేలురకం విత్తనాలు, సోలార్ ఫెన్సింగ్, రసాయన మందులు, కోళ్లు, పొట్టేళ్లు, గిరిజాతి ఆవులు, సమీకృత ఉద్యాన, పట్టు పరిశ్రమ, ఆయిల్‌పాం, కిసాన్ క్రెడిట్ కార్డు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు ప్రదర్శనకు ఉంచి రైతులకు అవగాహన కల్పించగా కలెక్టర్ సైతం అన్ని స్టాళ్లను సందర్శించారు. అనంతం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం కిసాన్‌మేళాను నిర్వహించి వేల సంఖ్యలో రైతులు సందర్శించేలా చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. కిసాన్‌మేళా ఓ చక్కని కార్యక్రమం.. దేశంలోని పరిశ్రమలు ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా కనుగొన్న కొత్త వంగడాలు, రసాయన ఎరువులు, యాంత్రిక పరికరాలు ఒకేచోట ఏర్పాటుచేసి రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారని, వీటి ద్వారా రైతులు కొత్త ఆలోచనలతో లాభసాటి వ్యవసాయం చేసేందుకు దోహదపడతాయన్నారు. ప్రతి మంగళవారం రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలు సాగు విధానం.. చీడపురుగుల నివారణ, లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారని, తప్పనిసరిగా హాజరై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని.. గతేడాది ఈ సమయానికి 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఈసారి కేవలం 42 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని వివరించారు. రైతులు వాతావరణానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో మినుము సాగు 30 వేల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. వచ్చే ఏడాది జిల్లాలో యూనిక్‌పామ్ ఆయిల్ కంపెనీ ప్రారంభమవుతుందని.. అప్పుడు జిల్లాలోనే ఆయిల్‌పాం క్రషింగ్ చేసి ఆయిల్ తీయడం జరుగుతుందన్నారు. రాబోయే తరానికి సారవంతమైన భూమి అందించడమే లక్ష్యంగా రైతులు సేంద్రియ సాగును ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి, సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


