వనపర్తిటౌన్: రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో బీజేవైఎం జిల్లాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి‘ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యార్థుల ఆందోళన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు రంగుల ప్రపంచం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. పేద విద్యార్థుల ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ నిధులను నిలిపివేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని జెన్ జీ హక్కుల గురించి సుదీర్ఘ ప్రసంగాలు చేసే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి తెలంగాణ విద్యార్థుల గోస కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలల యజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని.. దీంతో ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగ అవకాశాలు సాధించలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విద్యాసంస్థలు నడపలేక విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల సాధన కోసం భాజపా నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏకకాలంలో విడుదల చేసి విద్యార్థులకు భరోసా కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పురుషోత్తంరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దరాజు, బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


