వనపర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టే మహాధర్నాకు నిరుద్యోగ యువత అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రంలోని వివిధ కళాశాలలు, గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులను కలిసి మహాధర్నాకు తరలిరావాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకుపైగా ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు లక్ష్మి, జిల్లా ఆఫీస్ కార్యదర్శి ఉమా, నాయకులు నందిమళ్ల రాములు, బీసన్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.


