పశువుల ‘మూగ’ రోదన | - | Sakshi
Sakshi News home page

పశువుల ‘మూగ’ రోదన

Aug 2 2026 1:28 AM | Updated on Aug 2 2026 1:28 AM

జిల్లాలో ఖాళీలు ఇలా..

జిల్లా పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత

మొత్తం పోస్టులు 124.. ఖాళీలు 40

నియామకాలు చేపట్టని ప్రభుత్వం

ఇబ్బందులు ఎదుర్కొంటున్న

పాడి రైతులు

కొత్తకోట రూరల్‌: జిల్లా పశు సంవర్ధకశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా.. నియామకాలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో పశువైద్య సేవలు అందడంలో జాప్యం నెలకొంటోంది. జిల్లాలో 2 ప్రాంతీయ పశువైద్యశాలలు, 19 ప్రాథమిక పశువైద్యశాలలు, 29 పశు ఆరోగ్య ఉపకేంద్రాలు మొత్తం 50 ఉన్నాయి. ప్రతి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఒక పశువైద్యుడు, సహాయకుడు, సబార్డినేట్‌.. అలాగే పశు ఆరోగ్య ఉప కేంద్రాల్లో లైవ్‌ స్టాక్‌ ఆఫీసర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉండాలి. జిల్లాలో మొత్తం 124 అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులు ఆర్థికంగా ఎదగడానికి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ పశువులు, గొర్రెలు, మేకలు రోగాల బారిన పడినప్పుడు చికిత్స అందించేందుకు సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. గొర్రెలకు నట్టల నివారణ, వ్యాధి నిరోధక, పారుడు రోగ నివారణ టీకాలు ఏటా రెండు నుంచి మూడుసార్లు వేస్తారు. అలాగే పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, వర్షాకాలం ప్రారంభంలో వచ్చే గొంతువాపు, జబ్బవాపు టీకాలు వేస్తుంటారు. అలాగే పశువులు, గొర్రెలు, మేకలు రోగాల బారిన పడినప్పుడు సత్వర చికిత్సలు అందించడానికి సరిపడా సిబ్బంది లేకపోవడంతో పెంపకందారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పశువులు అనారోగ్యానికి గురైతే ఎద్దులబండి కట్టుకొని పశు వైద్యశాలకు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం అవి కనుమరుగుకావడంతో పశువులను వైద్యశాల వరకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. దీంతో పశు వైద్యాధికారులే ఇళ్లు, పొలాలకు వెళ్లి చికిత్సలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించినప్పుడే సత్వర వైద్యసేవలు అందుతాయి. ఎనిమల్‌ మొబైల్‌ మెడికల్‌ అంబులెన్స్‌ సేవలు సాయంత్రం ఐదుగంటల వరకే అందుతుండటంతో ఎమర్జెన్సీ సేవలు కరువయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికై నా పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత తీర్చాలని పాడి రైతులు, పెంపకందారులు కోరుతున్నారు.

జిల్లా పశువైద్యాధికారి 1, సహాయ సంచాలకులు 2, పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు 8, వెటర్నరీ లైవ్‌ స్టాక్‌ అధికారి 4, జూనియర్‌ వెటర్నరీ అధికారి 2, లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్‌ 2, వెటర్నరీ అసిస్టెంట్‌ 12, ఆఫీస్‌ సబార్డినేట్‌ (అటెండర్‌) 9.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement