గోపాల్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించినందని.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ప్రజా ఆరోగ్యం, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తోందని, అందరూ సహకరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శనివారం రేవల్లి, ఏదుల మండలాల్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశాలకు ఆయన హాజరయ్యారు. మూడు నెలల పురోగతిని శాఖల వారీగా అధికారులు వివరించగా.. సర్పంచుల ద్వారా సరైన సమాచారమా లేదా అని ఆరా తీశారు. రేవల్లిలో యూరియా బస్తాపై రూ.30 అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవల్లి, నాగపూర్‌లో రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించనున్నామని తెలిపారు. సభకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని.. మరోసారి రాకుంటే సస్పెండ్ చేయిస్తామన్నారు. ఏదులలో మిషన్ భగీరథ ట్యాంకులు మూడు మ్యాప్‌లో ఉన్నాయని.. ఊర్లో చూస్తే కేవలం రెండే ఉన్నాయని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ మంచినీరు గ్రామాల్లో సరఫరా కాకుంటే సర్పంచులు సంతకాలు చేయొద్దని సూచించారు. ఎస్‌ఐఆర్, ఈ–కేవైసీపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కె వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశిలారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లోడె రఘు, ప్రత్యేక అధికారి జ్యోతి పాల్గొన్నారు.
30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని.. 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ సంస్థ, సంఘం, వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అను మతి పొందాలన్నారు. చట్టాలను గౌరవించడ ం ప్రతి పౌరుడి బాధ్యతని.. ప్రజలందరూ పో లీసుశాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్ష ణలో భాగస్వాములు కావాలని సూచించారు.
‘కార్మికులపై తప్పుడు
ఆరోపణలు సరికాదు’
వనపర్తి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటి, పేషెంట్‌కేర్ కా ర్మికులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేసి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ హెచ్చరించారు. వనపర్తి మాత, శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని దొంగతనం నెపంతో తొలగించగా ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. శనివారం ఆయన జిల్లా ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం కార్మికలు, ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై చర్చలు జరిపారు. తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకోవడానికి ఏజేన్సీ నిర్వాహకులు అంగీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కనీస వేతనాలకు నోచుకోక ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తూ రోగులకు సేవలు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను చిన్న చిన్న పొరపాట్లు బూచిగా చూపి తొలగించడం సరికాదన్నారు.
14న వేలం పాటలు
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న ఆలయం వద్ద బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. లడ్డూ, ప్రసాదం, కొబ్బరికాయలు, పూల దండలు, పూజ సామగ్రి, వాహన పూజ సామగ్రి, తలనీలాల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణ, దుకాణదారులకు విద్యుత్ లైటింగ్ వసతి కల్పించుట, రంగుల రాట్నం, ,ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు వేలం నిర్వహించేలా దేవాదాయశాఖ నిర్ణయించినట్లు చెప్పారు. వేలంలో పాల్గొన దలచినవారు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, తలనీలాలు, రంగు రాట్నం, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం రూ.5లక్షల డీడీ, పూలు, పూలదండలు, టెంకాయల చిప్పల సేకరణ, విద్యుత్ లైటింగ్ వసతి కల్పించేందుకు రూ.2 లక్షల డీడీ తీసుకొని రావాలని ఈఓ తెలిపారు.


