82 మంది బాల కార్మికులకు విముక్తి | - | Sakshi
Sakshi News home page

82 మంది బాల కార్మికులకు విముక్తి

Aug 2 2026 1:28 AM | Updated on Aug 2 2026 1:28 AM

వనపర్తి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తోందని.. జిల్లాలో 12వ విడత ఆపరేషన్‌ ముస్కాన్‌ విజయవంతంగా పూర్తయిందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 82 మంది బాలకార్మికులను రక్షించామని, వీరిలో 78 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని చెప్పారు. బాలలను చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న 26 మంది యజమానులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకున్నామని. రక్షించిన బాలలను సంబంధిత శాఖల సమన్వయంతో పునరావాసం కల్పించి, వారి తల్లిదండ్రులకు బాలల హక్కులు, నిర్బంధ విద్య, కలిగే నష్టాలపై అవగాహన కల్పించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు వివరించారు. బాలల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. 12వ విడత ఆపరేషన్‌ ముస్కాన్‌ను విజయవంతం చేయడంలో పోలీసుశాఖ, కార్మికశాఖ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యా, వైద్యశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని వివరించారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించడం, బలవంతంగా భిక్షాటన చేయించడం, పశువుల కాపరులుగా, కిరాణా దుకాణాలు, మెకానిక్‌ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు, పరిశ్రమలు లేదా ఇతర పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా లేదా బాలలపై వేధింపులు, దోపిడీ జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098 లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement