వనపర్తి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్‌శ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు http s:// navodaya.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఆయా జిల్లాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు.
అతిథి ఉపాధ్యాయులకు..
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ (ఇంగ్లీష్ మీడియం) విద్యాలయలో అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి లలిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ (ఒకేషనల్ కోర్సు) బోధించుటకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. దరఖాస్తునకు చివరి గడువు 11వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.
బ్యాంకు సేవలు మరింత చేరువ
వీపనగండ్ల: ౖరెతులు, విద్యార్థులు, వృద్ధులకు తమ బ్యాంకు సేవలను మరింత చేరువ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాగర్‌కర్నూల్ రీజినల్ మేనేజర్ సంగీత అన్నారు. గురువారం మండల కేంద్రంలో కొత్త బ్రాంచ్‌ను సర్పంచ్ మీసాల పార్వతమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 943 శాఖలు కొనసాగుతున్నాయని, రైతులకు పంట రుణాలు, సాగు సామగ్రి కొనుగోలుకు అవసరమయ్యే రుణాలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కొత్త ఖాతాలు తెరుస్తున్నామని వివరించారు. ఖాతాదారులకు మొబైల్ ఏటీఎం ద్వారా మెరుగైన సేవలు అందజేస్తామన్నారు. బ్యాంకు అభివృద్ధికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ మదర్‌వలీ, క్యాషియర్ అరుణ్‌కుమార్, ఉపసర్పంచ్ బాలపీరు, వార్డు సభ్యుడు పెబ్బేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


