ఖిల్లాఘనపురం/గోపాల్‌పేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన వివరాలతో రాజీవ్‌చౌక్‌కు వస్తామని.. తొమ్మిదిన్నర బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఆధారాలతో రావాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. గురువారం ఖిల్లాఘనపురంలోని పద్మశాలి కల్యాణ మండపంలో ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలు, గోపాల్‌పేట మండలం బుద్దారం గండి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో జరిగిన గోపాల్‌పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రాంతాల్లో మార్కెట్‌యార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు మార్కెట్‌యార్డులు ఏర్పాటు చేయడంతో ఖిల్లాఘనపురం, పెద్దమందడి, గోపాల్‌పేట్, ఏదుల, రేవల్లి మండలాల రైతులకు మేలు చేకూరుతుందన్నారు. నూతన పాలకవర్గ సభ్యులు నిరంతరం రైతుల మేలు కోరి పని చేస్తుండాలని.. రైతులకు మేలుచేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో కల్వకుర్తి కాల్వ తీస్తే దానికి రెండు ప్రాంతాల్లో రంధ్రాలు చేసి తాము సాగునీరు తెచ్చామని కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇక్కడి నాయకులు మంత్రులుగా ఉండి కూడా రైతులకు చేసిందేమీ లేదన్నారు. త్వరలోనే మహిళా సంఘాల ద్వారా రైస్‌మిల్లులు ఏర్పాటు చేయించబోతున్నామని చెప్పారు. పొలికెపాడు, బుద్దారం శివారులో రూ.60 కోట్లతో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని.. జీఓ వచ్చిందన్నారు. ఏ ఒక్క కుటుంబానికి రేషన్‌కార్డు ఇవ్వని గత పాలకులు అలా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఖిల్లా ఘనపురంలో జరిగిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ నవనీత, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు, మార్కెట్‌యార్డు జిల్లా అధికారి పుష్పలత, నాయకులు రవీంధర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, సాయిచరణ్‌రెడ్డి, క్యామ వెంకటయ్య, వెంకటేశ్వరరావు, బాలకృష్ణారెడ్డి, క్యామరాజు, పద్మమ్మ, రమేష్, ఆగారం ప్రకాష్, కృష్ణయ్య పాల్గొన్నారు.


