‘సేంద్రియ’ ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

‘సేంద్రియ’ ప్రోత్సాహం

May 18 2026 12:12 AM | Updated on May 18 2026 12:12 AM

జిల్లాల వారీగా కేటాయింపులు.. (క్వింటాళ్లలో..)

మిగతా విత్తనాలు పూర్తి ధరకే..

విత్తనాలు సిద్ధం..

జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ

వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్‌లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లాల వారీగా వ్యవసాయశా ఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం వనపర్తి లోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని పలు పీఏసీఎస్‌ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

● గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

● పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్‌ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. యాభై శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు.

వనపర్తిలోని విత్తనశుద్ధి కర్మాగారంలో తరలింపునకు సిద్ధంగా ఉన్న విత్తనాలు

ఉమ్మడి జిల్లా రైతుల కోసం

9,200 క్వింటాళ్లు..

సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ

ఇప్పటికే నారాయణపేట,

పాలమూరు జిల్లాలకు సరఫరా

పంట విత్తనాలకు రాయితీ లేనట్టే..

జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్‌ చేస్తోంది.

ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్‌ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్‌, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం.

– ఆదినారాయణరెడ్డి, రీజియన్‌ మేనేజర్‌,

విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement