మరోమారు మంత్రి జూపల్లి సమీక్ష..
నత్తనడకన సింగోటం – గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు
● పూర్తికాని భూసేకరణ ప్రక్రియ
● రూ.147.7కోట్ల వ్యయంతో
నాలుగేళ్ల క్రితం పనులకు శ్రీకారం
● కెనాల్ పూర్తయితే
34 వేల ఎకరాలకు సాగునీరు
కొల్లాపూర్: సింగోటం – గోపల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కెనాల్ పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. భూ సేకరణలో జాప్యం కారణంగా నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఈ కెనాల్‌పై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. కెనాల్ నిర్మాణం పూర్తయితే వారికి సాగునీటి సమస్య తీరనుంది.
శాశ్వత పరిష్కారం కోసం..
కొల్లాపూర్ నియోజకవర్గంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ, భీమా కెనాల్ కింద వేలాది ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. చివరి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్‌లో సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సింగోటం – గోపల్‌దిన్నె లింక్ కెనాల్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా డిజైన్ రూపొందించారు. 2018లో ఈ కెనాల్ నిర్మాణానికి నిధుల కేటాయించగా.. 2022లో విడుదలయ్యాయి. రూ. 147.7కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు 2023లో వేగంగా జరిగాయి. తర్వాతి కాలంలో నిధుల విడుదలలో జాప్యం.. భూసేకరణ సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయి.
5 కి.మీ. మాత్రమే నిర్మాణం..
సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్ వరకు 22.5 కి.మీ. మేరకు కెనాల్ నిర్మించా ల్సి ఉంది. ఇందులో వనపర్తి జిల్లా పరిఽధిలో 18 కి. మీ., నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 4.5 కి.మీ., కా ల్వ తవ్వాలి. అయితే వనపర్తి జిల్లా పరిధిలో 200 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 100 ఎకరా ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. భూ నిర్వాసితు లకు ఎకరా రూ. 5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత పరిహారాన్ని రూ. 6లక్షలకు పెంచారు. కానీ రైతులు రూ. 20 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని మొండికేయడంతో కాల్వ తవ్వకాలు రెండేళ్ల క్రితం నిలిచిపోయాయి. గోపల్‌దిన్నె రిజర్వాయర్ నుంచి దాదాపు 5 కి.మీ. మేరకు మాత్రమే కాల్వ తవ్వకాలు చేపట్టారు.
ప్రయోజనం ఇలా..
సింగోటం – గోపల్‌దిన్నె లింక్ కెనాల్‌తో వీప నగండ్ల,చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం పాన్‌గల్ మండలంలో కొంత మేరకు సాగునీరు అందుతోంది. లింక్ కెనాల్‌కు తూములు ఏర్పా టుచేసి.. సమీపంలోని చెరువులు, కుంటలకు నీరు మళ్లించేలా డిజైన్లు రూపొందించారు. లింక్ కెనాల్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల ఎడమ కాల్వ కింద ఉన్న 24, 500 ఎకరాల ఆయకట్టు భూములతో పాటు రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుంది. అదే విధంగా వేసవిలో పలు గ్రామాలకు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు సింగోటం – గోపల్‌దిన్నె లింక్ కెనాల్ నిర్మాణంపై నీటిపారుదలశాఖ అఽధికారులతో సమీక్షించారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. పనుల పూర్తికోసం సంబంధిత కాంట్రాక్టు కంపెనీతో మాట్లాడారు. ఏడాది క్రితం కెనాల్ పనులను పునఃప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూ సేకరణ కోసం కలెక్టర్ల వద్ద రూ. 25కోట్ల మేరకు నిధులు ఉండటంతో రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని ఆయన సూచించారు. కానీ భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఇటీవల మంత్రి జూపల్లి మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులను ఒప్పించి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా రైతులతో మాట్లాడతానని ఆయన వారికి సూచించారు.


