వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావాలని, అదేవిధంగా గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వరి కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా రోజు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద సరిపడా లారీలను అందుబాటులో ఉంచి, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రస్తుత అవసరాల మేరకు నిర్దేశిత కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీలను పంపాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, లోడింగ్, అన్‌లోడింగ్ విషయంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, పోలీసు అధికారుల సమన్వయంతో అన్‌లోడింగ్ చేయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశిత లక్ష్యం ప్రకారం వరి ధాన్యం కొనుగోళ్లు జరగాలని.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వేగంగా తూకం వేసి కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా మేనేజర్ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైస్‌మిల్లులు, గోదాంల తనిఖీ..
ఖిల్లాఘనపురం: గోదాములు, రైస్‌మిల్లుల వద్ద వరి ధాన్యం లారీల అన్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. ఆదివారం మండలంలోని మానాజీపేట దగ్గర ఉన్న ఖిల్లా ఆగ్రో గోదాం, శ్రీరామ ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ధాన్యంతో ఉన్న లారీలు, డీసీఎంల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, గోదాములు, రైస్‌మిల్లులకు వచ్చిన వాహనాల్లోని ధాన్యం బస్తాలను దించే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలని.. గ్రామాల్లోని కేంద్రాల దగ్గర వేగంగా తూకాలు చేయించడం, బస్తాలను వెంటనే లారీల్లో మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, ఎస్‌ఐ వెంకటేష్, ఆర్‌ఐ తిరుపతయ్య, సింగిల్‌విండో సీఈఓ కృష్ణ తదితరులు ఉన్నారు.


