● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
కొత్తకోట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఆయన పెద్దమందడి మండలం వెల్టూరు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ, బోధన విధానం, విద్యార్థినుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థినుల వివరాలు తెలుసుకొని ప్రత్యేక శ్రద్ధతో బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థినుల మార్కుల జాబితాను పరిశీలించారు. అనంతరం వంటశాల, స్టాక్ రిజిస్టర్, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, ఆహార నాణ్యత పరిశీలించారు. శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని.. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పదోతరగతి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం పెద్దమందడిలోని బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రహరీ, టాయిలెట్స్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
పెద్దమందడి, వెల్టూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న లబ్ధిదారులను గుర్తించి వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అదేవిధంగా గ్రౌండింగ్‌కు నోచుకోని ఇళ్లను వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెద్దమందడిలో రూ.5 లక్షలతో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని సందర్శించారు. ఇంటి నిర్మాణంలో ఏమైనా సందేహాలుంటే నమూనా ఇందిరమ్మ ఇంటిని సందర్శించి ఇంజనీర్లతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ డీఈ విఠోభా, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ పరిణత, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు ఉన్నారు.


