నర్వ.. ప్రగతి బావుటా
సమకూరనున్న నిధులు
జిల్లాలో నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్‌కు ఎంపికతో మహర్దశ
● 2024–25లో ఆస్పిరేషన్ బ్లాక్
కార్యక్రమానికి ఎన్నిక
● ఆరు విభాగాల్లో ఉత్తమ పనితీరుపై ప్రశంసలు
● దక్షిణ భారతంలో ప్రథమ,
జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు
● కేంద్ర ప్రభుత్వం నుంచి
సమకూరనున్న మరిన్ని నిధులు
●
నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గాను దేశంలో 500 వెనకబడిన ప్రాంతాలను గుర్తించగా.. ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం, నారాయణపేట జిల్లాలో నర్వ మండలాన్ని ఎంపిక చేసింది. ఇందులో సమగ్ర అభివృద్ధి సాధించేలా.. ఆరోగ్యం, పోషణ, విద్య, పారిశుద్ధ్యం, నీటి వసతి, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఈ మేరకు మొదటి మూడు నెలలపాటు చేపట్టిన న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్ (వ్యవసాయం), విద్య (ఎడ్యుకేషన్, నీటి వసతి, సోషల్ సెక్టార్) విభాగాల్లో మెరుగైన పనితీరుపై ఇటీవల జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానం, మొత్తం జాతీయ స్థాయిలో నర్వ మండలం యాస్పిరేషన్ బ్లాక్ 3వ ర్యాంకు సాధించినట్లు అధికారులు గణంకాలు విడుదల చేశారు. అలాగే దేశవ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న అనేక ప్రాంతాలకు నర్వ బ్లాక్ దిక్సూచిగా నిలిచింది. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన వాటర్ బడ్జెటింగ్ ఇన్ యాస్పిరేషనల్ బ్లాక్స్ నివేదికలో నర్వ బ్లాక్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది.


