ఒత్తిడి లేకుండా చదవాలి | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి లేకుండా చదవాలి

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

ఒత్తి

ఒత్తిడి లేకుండా చదవాలి

వనపర్తిటౌన్‌: ఒత్తిడి లేకుండా చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని 21 సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ చైర్మన్‌ కృష్ణ ప్రదీప్‌ అన్నారు. ఒత్తిడితో చదివితే కేవలం పరీక్ష సమయం వరకే గుర్తుంటుందని.. ఒత్తిడి లేకుండా చదివితే నిద్రలో లేపి అడిగినా జవాబులు ఇవ్వగలరని వివరించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ప్రజా సేవకుడు డా. పోచ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీలకు ప్రత్యామ్నాయ కోర్సులు చాలా ఉన్నాయని.. వాటిని అభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చన్నారు. పదోతరగతి అనంతరం ఎలాంటి కోర్సులు చేయాలి, ఇంటర్‌ తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎంపీసీ, బైపీసీలకు ప్రత్యామ్నాయ కోర్సులు.. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలనే తదితర అంశాలను వివరించారు. అనంతరం పోచ రవీందర్‌రెడ్డిని శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ డా. భవానిశంకర్‌, యాజమాన్యం వేణు, విశ్వనాథం పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

పాన్‌గల్‌: అప్పుల బాధతో గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కావలి గట్టయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్‌, జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యానాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని దావాజిపల్లిని సందర్శించి కౌలు రైతు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గట్టయ్య తనకున్న అర ఎకరం భూమితో పాటు ఇతర రైతుల నుంచి కొంత పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేశారని.. పెట్టిన పెట్టుబడి, పంటల దిగుబడి సక్రమంగా రాక అప్పులు ఎలా తీర్చాలనే దిగులుతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు, భూమి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా నాయకులు దేవేందర్‌, కేవీపీఎస్‌ జిల్లా నాయకుడు భగత్‌, మాజీ సర్పంచ్‌ వెంకటయ్యయాదవ్‌, రైతులు పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగులు సమాజసేవ చేయాలి

వనపర్తిటౌన్‌: విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులు సమాజ సేవ చేసేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో ఇటీవల పదవీ విరమణ పొందిన సుక్క శేఖర్‌ ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన హాజరై దంపతులను పూలమాల, శాలువాతో సన్మానించి మాట్లాడారు. వృత్తికే విరమణ అని.. వ్యక్తి సామాజిక సేవలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పలుస శంకర్‌గౌడ్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, పార్టీ నాయకులు, ప్రజానాయకులు బైరోజు చంద్రశేఖర్‌, ఉందెకోటి నాగేందర్‌, రామన్‌పాడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

రేపు కురుమూర్తిస్వామి ఆలయం మూసివేత

చిన్నచింతకుంట: పౌర్ణమి, చంద్ర గ్రహణం నేపథ్యంలో మంగళవారం కురుమూర్తిస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు ఈఓ మధనేశ్వర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ఒత్తిడి లేకుండా చదవాలి 
1
1/2

ఒత్తిడి లేకుండా చదవాలి

ఒత్తిడి లేకుండా చదవాలి 
2
2/2

ఒత్తిడి లేకుండా చదవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement