కో‘ఆప్షన్‌’ దక్కేనా..? | - | Sakshi
Sakshi News home page

కో‘ఆప్షన్‌’ దక్కేనా..?

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

కో‘ఆప్షన్‌’ దక్కేనా..?

కో‘ఆప్షన్‌’ దక్కేనా..?

పార్టీకి ద్రోహం చేస్తే చర్యలు..

నామినేటెడ్‌, పార్టీ పదవుల కోసం ఓడిన నేతల ప్రయత్నాలు

మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్‌ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు

వనపర్తి: పుర, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిన అధికార పార్టీ నేతలు కో–ఆప్షన్‌, నామినేటెడ్‌, పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, డీసీసీ చీఫ్‌ కొత్తకాపు శివసేనారెడ్డి ఆశీస్సులతో జిల్లా, రాష్ట్రస్థాయి నామినేటెడ్‌, పార్టీలో కీలక పదవులు దక్కించుకునేందుకు నేతలు వారి వారి స్థాయిలో పావులు కదుపుతున్నారు. కో–ఆప్షన్‌, త్వరలో ఖాళీ అవుతున్న నామినేటెడ్‌ పదవుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవరిని ఆదరిస్తారోనన్న చర్చలు అఽధికార పార్టీలో జోరందుకున్నాయి.

సస్పెండ్‌ అయిన వారి దారెటు..?

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకేంద్రంలో 8 మంది రెబల్స్‌పై డీసీసీ అధ్యక్షుడు సస్పెండ్‌ వేటు వేశారు. వారు ఇప్పటి వరకు ఎలాంటి లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వలేదు. వారిని పార్టీ మళ్లీ చేరదీస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే మరికొందరు రెబల్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాంటి వార్డుల్లో అధికార కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వారు తమ పరిస్థితి ఏమిటనే ధోరణిలో ఉన్నారు. నామినేటెడ్‌ పదవుల భర్తీకిగాను పార్టీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌లు ఢిల్లీ పెద్దలతో అనుమతి కోసం ప్రయత్నాలు ప్రారంభమైన విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు వారి ప్రయత్నాలను మరింత ఉధృతం చేస్తున్నారు.

పురపాలికల్లో..

సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమి పాలైన వారు పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. పుర ఎన్నికల్లో ఓడిన కొందరు సీనియర్లు కౌన్సిలర్‌తో సమాన హోదా ఉన్న కో–ఆప్షన్‌ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత కౌన్సిల్‌లో ఉండి.. ఇటీవల ఓడిన వారే ఈ పదవుల కోసం ఎక్కువగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్‌ పోస్టులు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

పుర ఎన్నికల్లో ఓటమిపాలైన వారు వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులైనా తమ కనుసన్నల్లోనే జరిగేలా ఎమ్మెల్యే, పుర పాలకవర్గంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులకు వచ్చే సాధారణ నిధులు, పనులు మినహా ప్రత్యేకించి చేసే ఎలాంటి పనులు వారికి దక్కనివ్వకుండా క్యాడర్‌ను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకు వారు సైతం సుముఖంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

పార్టీకి ద్రోహం చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదు. రెబల్స్‌గా బరిలో నిలిచి పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకులైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. నామినేటెడ్‌, పార్టీ పదవుల భర్తీలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి పార్టీ పెద్దలతో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సర్పంచ్‌, పుర ఎన్నికల్లో ఓడిన వారిని పార్టీ కాపాడుకుంటుంది. వారికి తగిన న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం.

– శివసేనారెడ్డి, డీసీసీ చీఫ్‌, వనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement