లక్ష్యం.. నిర్లక్ష్యం..!
ప్రత్యేక బృందాలుగా..
ఆస్తి పన్ను వసూళ్లకు మిగిలింది నెలరోజులే..
● జిల్లాలోని 5 పురపాలికల లక్ష్యం రూ.19.20 కోట్లు
● ఇప్పటి వరకు వసూలైంది కేవలం రూ.6.88 కోట్లు మాత్రమే
● వసూళ్లకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
పట్టణంలో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. పుర ఎన్నికల సందర్భంగా ఆశించిన మేర పన్ను వసూలు చేయడంలో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అయిన రూ.2.24 కోట్లకుగాను ఇప్పటి వరకు రూ.89 లక్షలు వసూలు చేశాం. మిగిలిన మొత్తాన్ని నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం. ఇంటి పన్నుతో పాటు కొళాయి పన్ను సైతం వసూలు చేస్తున్నాం.
– చికెన్ శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్
మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఈ ఏడాది లక్ష్యం రూ.62 లక్షలు కాగా.. వార్డు అధికారులతో కలిసి ఇల్లిల్లూ తిరిగి పన్ను వసూలు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.27 లక్షలు వసూలు చేశాం. – నూరుల్ నదీం,
పుర కమిషనర్, అమరచింత
అమరచింత: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఆస్తి, ఇంటి పన్ను వసూళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి చివరి నాటికి వంద శాతం పన్ను వసూలు చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలున్నా.. నెలరోజుల్లో లక్ష్యం ఎలా చేరుకుంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పన్ను వసూళ్లకు పురపాలికల్లోని బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు బాధ్యతలు అప్పగించినా.. వసూళ్లు మాత్రం సగానికే పరిమితమయ్యాయి. ఇంటి పన్ను వసూలైతేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని పుర అధికారులు వెల్లడిస్తున్నారు. సకాలంలో వసూళ్లు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రణాళికతో ముందుకు సాగుతున్నా.. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పన్ను వసూళ్లు చేపట్టాలని అధికారులు వత్తిడి పెంచడంతో సెలవు దినాల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్నారు.
పుర కమిషనర్లు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తిపన్నును పూర్తిస్థాయిలో వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. వార్డుల వారీగా వార్డు అధికారులతో పాటు మిగిలిన సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. ఉదయం ఎనిమిది నుంచే ఇల్లిల్లూ తిరిగి పన్ను వసూలు చేస్తున్నారు. సెలవు రోజుల్లో సైతం తిరిగి ఇంటి పన్నులు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
పురపాలికల వారీగా పన్ను
వసూళ్లు ఇలా.. (రూ.కోట్లలో..)
మున్సిపాలిటీ లక్ష్యం వసూలు
చేసింది
వనపర్తి 12.86 3.85
ఆత్మకూర్ 2.24 0.89
కొత్తకోట 2.20 1.08
పెబ్బేరు 1.20 0.79
అమరచింత 0.62 0.27
లక్ష్యం.. నిర్లక్ష్యం..!
లక్ష్యం.. నిర్లక్ష్యం..!
లక్ష్యం.. నిర్లక్ష్యం..!


