తెలుగు భాషా పరిరక్షకులు
కవుల పోషణ
అభివృద్ధికి
చిరునామా..
ఉద్యానవనాల పెంపకంపై దృష్టి
సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్, కొల్లాపూర్‌లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్‌లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధాన్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి.
నిజాం నవాబులకు సామంతులుగా ఉన్న సురభిరాజులు పరిపాలనలో ఎక్కడ కూడా నిజాం పోకడలను అనుసరించలేదు. ప్రధానంగా భాషా పరిరక్షణలో వారు తెలుగుకే ప్రాధాన్యం ఇచ్చారు. సంస్థానాల్లో చాలాచోట్ల ఉర్దూ ప్రభావం ఉన్నప్పటికీ.. జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానంలో మాత్రం ఆ ఊసు ఎక్కడా కనిపించదు. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా 1920లో కొల్లాపూర్ కవులచే స్నేహలతా కవితా సంఘాన్ని ఏర్పాటు చేయించి.. దాని నిర్వహణకు సహకరించారు. 1930లో రాణి రత్నమాంబ ఆర్థిక సహకారంతో వైజయంతి అనే తెలుగు పత్రికను ప్రచురించారు.
సురభిరాజులు ప్రజారంజక పాలనతోపాటు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలోనూ ముందున్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉన్న రెండు విమానాలలో ఒకటి మద్రాసు పాలకులది కాగా.. రెండోది సురభి రాజులది. ఇద్దరు ప్రయాణించగల ఈ విమానాన్ని సురభి వెంకటలక్ష్మారావు కూతురు అయిన సరస్వతిదేవి అమ్మయ్యగారి భర్త బొబ్బిలి రాజ్యానికి చెందిన ఐవీ కృష్ణారావు నడిపేవారు. 1935 ఆగస్టు 25న కృష్ణారావు చనిపోవడంతో ఆయన స్మృత్యార్థం ఆర్‌ఐడీ బాలుర కళాశాల సమీపంలో స్తూపం ఏర్పాటు చేశారు. రైల్వే వ్యవస్థ ప్రారంభమయ్యాక కొల్లాపూర్‌కు రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదనను బ్రిటీష్ పాలకులు తీసుకురాగా సురభిరాజులు తిరస్కరించారు. ఇక్కడి సంపదను తరలించుకుపోతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతారు.
కొల్లాపూర్ పట్టణాన్ని సురభిరాజులు అభివృద్ధికి చిరునామాగా మార్చారు. దేశంలో విద్యుత్ వాడకం ప్రారంభమైన తొలినాళ్లలోనే మద్రాసు సంస్థానంతోపాటు విద్యుత్ వినియోగించిన పట్టణాల్లో కొల్లాపూర్ ఒకటి. 18వ శతాబ్దంలోనే ధర్మాస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద వైద్య సేవలు అందించారు. 1920లోనే టౌన్ ప్లానింగ్ రూపొందించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం వేలాది ఎకరాలకు సాగునీరందించేలా సింగోటం శ్రీవారి సముద్రం చెరువు నిర్మించారు. హిందూ, ముస్లింలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ.. జటప్రోల్‌లో హజ్రత్ ఇనాయత్‌షా ఖాద్రీ దర్గా ఉర్సుకు మదనగోపాలస్వామి ఆలయం నుంచి పూజా సామగ్రిని పంపించేవారు.
బొబ్బిలి రాజవంశాలతో బంధుత్వం ఉన్న సురభి రాజులు అక్కడి నుంచి వివిధ రకాల మామిడి మొక్కలను తెచ్చి కొల్లాపూర్‌లో ఉద్యానవనాల సాగుకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మామిడి మొక్కలను కొల్లాపూర్‌లోని పెద్దతోటలో సాగుచేశారు. పెద్దతోటలో కాచిన పండ్లను బ్రిటీష్ పాలకులతోపాటు నిజాం నవాబులకు పంపేవారు.
సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్ కవి వంటి ఉద్దండులు ఉండేవారు.


