లెక్కలు తారుమారు!
గెలుపు, ఓటములతో
సంబంధం లేకుండా..
ఎన్నికల ఖర్చు లెక్కల్లో పుర అభ్యర్థులు
● ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో
అందజేయాలంటున్న అధికారులు
● లేదంటే అనర్హత వేటు
● ఈసీ నిబంధనల మేరకు
తక్కువ చేసి చూపేందుకు సన్నద్ధం
● వ్యయం రూ.లక్షల్లో..
చూపేది రూ.వేలల్లో
●
వనపర్తి టౌన్: పుర ఎన్నికల బరిలో నిలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు ఖర్చు లెక్క రూ.లక్ష దాటకుండా చూపేందుకు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి 45 రోజుల్లో లెక్కలు చూపాలని లేదంటే అనర్హత వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు లెక్క చూపలేదని 33 మందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో ఈసారి ఎన్నికల ఖర్చు లెక్క చూపేందుకు కొత్త, పాత అభ్యర్థులు దృష్టి సారించారు. టి, టిఫిన్, పత్రిక ప్రకటనలు, నమూనా బ్యాలెట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ప్రచార రథం, డ్రైవర్ బత్తా, భోజనం, మైక్‌సెట్ ఇలా ప్రతిదానికి ఎన్నికల సంఘం విధించిన పరిమితి దాటకుండా లెక్కలు చూపాల్సి ఉంటుంది. నామినేషన్ల పర్వం మొదలు ప్రచారం పూర్తయ్యే వరకు రోజువారీ లెక్కల నమోదులో అభ్యర్థులు పక్కాగా తప్పుడు లెక్కలు చూపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం విధించిన ఖర్చు పరిమితి రూ.లక్ష మాత్రమే ఉండటంతో అంతలోపే వెచ్చించినట్లు బిల్లులు తయారు చేయిస్తున్నారు.
వనపర్తి పురపాలికలో 33 వార్డులుండగా.. 220 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పదవి దక్కించుకోవాలనే లక్ష్యంతో పలుచోట్ల లెక్కకు మించిన ఖర్చు చేయగా.. మాజీ కౌన్సిలర్లు మళ్లీ పాగా వేసేందుకు, చైర్మన్ అభ్యర్థులు బరిలో నిలిచిన స్థానాల్లో ఈ ఖర్చు భారీగానే చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ప్రచారానికి వెళ్లేందుకు అభిమానంతో వచ్చే సొంత మనుషులు కరువవడంతో పదుల సంఖ్యలో రోజువారీ కూలీలను పిలిపించారు. వారికి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు కూలి చెల్లించి జైజైలు కొట్టించుకున్నారు. కూలీలందరికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందు భోజనంతో కలుపుకొని రోజుకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు, కొన్నిచోట్ల రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. దీనికితోడు రోజువారీగా ప్రచారం ముగిసిన తర్వాత మద్యం పంపిణీ షరా మమూలే. ఓటుకు నోట్లు ఇవ్వడం తెలిసిందే. అయితే అభ్యర్థులు అధికారులకు అందజేసిన లెక్కలు చూస్తే మాత్రం ధరలు ఇంత తక్కువగా ఉన్నాయా అనిపించకమానదు. విచిత్రం ఏమిటంటే అభ్యర్థులు మాత్రం రోజుకూ రూ.వెయ్యి నుంచి రూ.1,500 మించకుండా లెక్కలు చూపించేందుకు సిద్ధం కావడం గమనార్హం.
పుర ఎన్నికల అనంతరం గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా అందరు అభ్యర్థులు 45 రోజుల్లోగా ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. లేదంటే కొన్నేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. ఇన్నాళ్లు ప్రచార పర్వంలో మునిగిన అభ్యర్థులు ఇప్పుడు ఖర్చు వివరాలు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా బరిలో నిలిచిన వారు సీనియర్ల సలహాలతో వివరాలు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.
లెక్కలు తారుమారు!


