‘పుర ఎన్నికల్లో నైతిక విజయం మాదే’
అమరచింత: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటైన సమాధానమిచ్చి నైతిక విజయం సాధించామని బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మాపురం, చంద్రగఢ్ గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను శనివారం ఆయన ప్రారంభించి కిష్టంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అమరచింత పురపాలిక ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కౌన్సిలర్లు, బరిలో నిలిచి ఓడిన అభ్యర్థులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుర ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక అధికారపార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకొని ఆశించిన స్థానాలను సైతం చేజిక్కించుకోలేకపోయిందన్నారు. అధికార దాహంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను కాంగ్రెస్‌పార్టీలో చేర్చుకొని పుర పీఠం కై వసం చేసుకోవడం వింతగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమని.. రాబోయే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు కై వసం చేసుకునేలా ముందుకెళ్తామన్నారు. అనంతరం కౌన్సిలర్ మేర్వ రాజు మాట్లాడుతూ.. అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్నారని, అవినీతి పనులతో నిధులు కాజేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు, కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య, కౌన్సిలర్లు పారుపల్లి ఊషన్న, వేద విష్ణు, వెంకటేశ్వర్లు, రాజేందర్‌రెడ్డి, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


