‘భూ భారతి’ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం
పాన్‌గల్: మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి భూ భారతి వినతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 95కి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, తహసీల్దార్ పరిధిలో ఉన్నవి పరిష్కరించి మిగతా వాటిని జిల్లా అధికారులకు సిఫారస్ చేయాలన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, డీటీ అశోక్‌కుమార్, ఆర్‌ఐ మహేష్, సిబ్బంది ఉన్నారు.
మేజర్–2 కాల్వ
పునరుద్ధరణ
గోపాల్‌పేట: మండల కేంద్రం నుంచి ఏదుట్ల మార్గంలో ఉన్న డీ–8 మేజర్–2 కాల్వకు బుధవారం గండిపడగా అధికారులు శుక్రవారం పునరుద్ధరించారు. కాల్వ ప్రారంభంలో నీటి ప్రవాహం అధికమై అక్కడ ఉన్న రెండు గూనలు కొట్టుకుపోయాయి. స్థానిక రైతులు విషయాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి అధికారులతో త్వరగా మరమ్మతు పూర్తి చేయించారు. వేసవిలో స్ట్రక్చర్ ఏర్పాటు చేయించి మరోమారు గండి పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
‘చీర్ల చందర్
క్షమాపణ చెప్పాలి’
వనపర్తిటౌన్: ఆర్యవైశ్య మహిళా చైర్‌పర్సన్‌ను అవమానించేలా చీర్ల చందర్ మాట్లాడడం సరికాదని.. భేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హెచ్చరించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఒక ఆర్యవైశ్య మహిళ చైర్‌పర్సన్‌గా ఎన్నికై తే ఓర్వలేకపోతున్నారని.. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌లో ఉండకూడదని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు చందర్ రూ.40 లక్షలు లంచం తీసుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఆయనకు దమ్ముంటే బీసీ కులాలకు అండగా నిలబడాలని సవాల్ విసిరారు. ఆర్యవైశ్యుల వ్యాపారాన్ని, కులాన్ని కించపర్చేలా, మహిళలను అవమానపర్చేలా మాట్లాడడం ఏ మాత్రం ఆమోధ యోగ్యం కాదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి సగరులకు కేటాయించలేదా అని ప్రశ్నించారు. చందర్ తీరును ఎండగట్టేందుకే హైదరాబాద్ నుంచి వచ్చానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు, శ్రీనాథ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
‘భూ భారతి’ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం
‘భూ భారతి’ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం


