ఓడామని అధైర్యపడొద్దు : మేఘారెడ్డి
వనపర్తి రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు ఎవరూ అధైర్యపడొద్దని.. గెలిచిన కౌన్సిలర్లతో సమానంగా ప్రాధాన్యం ఉంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా పట్టణంలోని సుభాష్ చౌరస్తాలో కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడితో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కౌన్సిలర్లను గజమాలతో సత్కరించి పూలవర్షం కురిపిస్తూ బాణసంచా కాల్చారు. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీగా పుర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు దగ్గరుండి చైర్మన్, వైస్ చైర్మన్‌ను అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ చైర్మన్ చాంబర్‌లోకి తీసుకెళ్లి కుర్చీల్లో కూర్చోబెట్టారు. అనంతరం ఇరువురిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తూ పల్లెలు, పట్టణాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి, రహదారి విస్తరణ, సంత స్థల వివాదం, సీసీ రోడ్లు, వీధిదీపాలు తదితర మౌలిక వసతులపై దృష్టి సారించిందన్నారు. పుర ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ సుమారు 95 శాతం పీఠాలను కై వసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని ఐదు పురపాలికలను సైతం చేజిక్కించుకున్నట్లు తెలిపారు.


