‘ఇంటర్’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● ప్రతి అధికారి బాధ్యతగా
విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నందున పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగనుండగా.. విద్యార్థులు సకాలంలో చేరుకునేలా తగిన సూచనలు చేయాలని, పరీక్షల విధులు నిర్వర్తించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 6,216 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 6,437 మంది పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. 10 ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల్లో అవసరమైన ఫర్నీచర్, సీసీ కెమెరాలు సమకూర్చాలని, ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీస్‌శాఖ తగిన బందోబస్తు కల్పించాలని, పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉండేలా చూడాలన్నారు. కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పా టు చేసి వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు తగిన చర్యలు చేపట్టాలని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌శాఖ అధికారులు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలన్నారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎర్ర అంజయ్య, వైద్యాధికారి డా.సాయినాథ్‌రెడ్డి, ఎస్‌ఐ హరిప్రసాద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


