నేడు సంత్ సేవాలాల్ జయంతి
వనపర్తి: సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నాగవరంలోని బంజారా భవన్‌లో గిరిజన సంక్షేమ, అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతాయని.. నిర్వహణ స్థలంలో అవసరమైన వేదిక, సౌండ్ సిస్టం, కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
నాగుపాము పట్టివేత
కొత్తకోట రూరల్: మండలంలోని పాలెం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భారీ నాగుపాము పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తెలుగు సాయికిరణ్ భార్య మానస సోమవారం రాత్రి తన పెంపుడు కుక్కను ఇంటి కాంపౌండ్‌లో తిప్పుతుండగా.. కోళ్ల జాలిగూడు సమీపంలో భారీ నాగుపాము కనిపించింది. భయంతో వెంటనే డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కృష్ణసాగర్, ఏఆర్ కానిస్టేబుల్ శ్రీను బైక్‌పై గ్రామానికి చేరుకొని 40 నిమిషాల పాటు శ్రమించి నాగుపామును సురక్షితంగా పట్టుకున్నారు. కార్యక్రమంలో సాగర్ స్నేక్స్ సభ్యుడు గోపాల్ యాదవ్, కానిస్టేబుల్ శ్రీనివాసులు, సత్యం, హోంగార్డ్ కృష్ణ పాల్గొన్నారు.
రాజకీయంగా రాణించడం అభినందనీయం
కొత్తకోట: మున్సిపల్ ఎన్నికల్లో సగరులు రాజకీయంగా పదవులు చేపట్టడం అభినందనీయమని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ అన్నారు. మంగళవారం పట్టణంలో పుర చైర్‌పర్సన్ పోతులపల్లి అరుణ శ్రీనివాస్‌సాగర్, 7వ వార్డు కౌన్సిలర్ పోతులపల్లి గాయత్రి సత్యం సాగర్‌ను సంఘం నాయకుడు ఉప్పరి శేఖర్ సాగర్‌తో కలిసి ఆయన శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అస్కాని శ్రీను సాగర్, చీర్ల లలిత రాముసాగర్, చీర్ల పద్మజ నాగన్నసాగర్‌ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు సగరులకు అవకాశాలు కల్పించడం శుభసూచకమని కొనియాడారు. రాబోయే అన్ని ఎన్నికల్లో అధికసంఖ్యలో పోటీచేసి తమ సత్తా చాటాలని కోరారు. పుర చైర్‌పర్సన్ పదవిని సగరులకు కేటాయించినందుకు ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌బీ ఆంజనేయులు, సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యం సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రాయుడు, మండల అధ్యక్షుడు కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేడు సంత్ సేవాలాల్ జయంతి


