విద్యావ్యవస్థ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తిటౌన్: విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉమ్మడి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి, విద్యా పరిరక్షణ కమిటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎన్ కిష్టప్ప అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీఎన్‌జీఓ భవనంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో ‘విద్యావ్యవస్థలోని లోపాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావ్యవస్థ గాడి తప్పుతోందని, ఇలాగే కొనసాగితే పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, కొన్నిచోట్ల విద్యార్థులు లేరనే కారణం చూపుతూ ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు మాత్రం కేటాయించరని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రభుత్వ పాఠశాలలు మూతబడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జి.స్వరాజ్యం, అధ్యక్షుడిగా జి.శివారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా యేసోపు, ఉపాధ్యక్షులుగా సి.మద్దిలేటి, ఆర్.శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్, రుద్రమదేవి, నారాయణ, ప్రధానకార్యదర్శిగా కొంకల వెంకటనారాయణ, అసోసియేట్ కార్యదర్శిగా శ్రీనివాసులు, కార్యదర్శులుగా నర్సింహ, అగ్గి రాముడు, ప్రభాకర్, విజయలక్ష్మి, గోపాలకృష్ణ, కార్యవర్గసభ్యులుగా శ్రీనివాస్, కె.శ్రీనివాస్‌గౌడ్, నర్సింహ, కె.వెంకటేశ్వర్లు, శాంతన్న, ఎం.కేశవులు, ఎం.చంద్రశేఖర్, పి.చంద్రశేఖర్, వి.కురుమూర్తి, ఎస్.చంద్రశేఖర్, చిన్న రాములు, ఎం.వేణుగోపాల్, రమేశ్, ఎంఏ సత్తార్, జగపతిరావు ఎన్నికయ్యారు.


