పాలమూరు పీఠం.. అంతా నాటకీయం!
మేయర్ పీఠముడితో అటు డీసీసీ, ఇటు ఎమ్మెల్యే వర్గం కాకుండా తటస్థంగా వాణిశ్రీ ప్రశాంత్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. సీల్డ్ కవర్‌లో ఆమె పేరే వస్తుందని అందరూ భావించారు. అయితే ప్రమాణ స్వీకారం సమయానికి వచ్చేసరికి ఆ పేరు గల్లంతు కావడం.. గుమాల మమతను మేయర్‌గా ప్రతిపాదించడం.. ఆమెనే ఏకగ్రీవం కావడం చకచకా జరిగిపోయింది. దీంతో ముదిరాజ్ వర్గంలో సంబరాలు మిన్నంటగా.. ఎమ్మెల్యే వర్గం నేతలే ప్రసన్న ఆనంద్‌గౌడ్‌కు పీఠం దక్కకుండా పక్కా ప్లాన్‌తో రాజకీయాలు నెరిపారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు డిప్యూటీ మేయర్‌గా 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన మారేపల్లి సురేందర్ రెడ్డి పేరు తొలి నుంచీ విన్పించగా.. ఆయనకే దక్కింది. అయితే ఈ పీఠాన్ని తన కుమారుడు ఉమర్ కొత్వాల్‌కు ఇవ్వాలని ఆశించిన రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌కు భంగపాటు ఎదురుకాగా.. ఆయన నిరాశలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. మేయర్ ఎన్నికై న మమత భర్త శ్రీనివాస్ ఏడాదిన్నర క్రితమే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌లో పాత, కొత్త లొల్లి మళ్లీ రాజుకున్నట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన మహబూబ్‌నగర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకున్నా.. మేయన్ పదవి కోసం చోటుచేసుకున్న రాజకీయాలు ఆద్యంతం ఉత్కంఠ రేపాయి. 13న ఫలితాల అనంతరం హస్తం నుంచి గెలుపొందిన 29 మందితో పాటు స్వతంత్రులు నలుగురిని ఏపీలోని చీరాల క్యాంప్‌నకు తరలించిన నాటి నుంచీ నాటకీయ పరిణామాలు నిత్యకృత్యంగా మారాయి. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక అటు డీసీసీ, ఇటు ఎమ్మెల్యే, ఆయన వర్గంగా ముద్రపడిన పలువురు నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఈ అంశం రాష్ట్ర, డిల్లీ పెద్దల చేతుల్లోకి వెళ్లడంతో చివరకు క్యాంప్ చీరాల నుంచి హైదరాబాద్‌కు మారింది. మేయర్‌గా తొలుత ఒకరు.. తర్వాత మరొకరు.. ఇంకొకరు అంటూ ఆదివారం అర్ధరాత్రి దాటే వరకు హైడ్రామా కొనసాగింది. ఇక ప్రమాణ స్వీకారం రోజు సోమవారం ఉదయం మహబూబ్‌నగర్‌కు బయలుదేరుతున్న క్రమంలో శిబిరానికి పోలీసులు రావడం వంటి తదితర ఘటనలు పాలమూరును హీటెక్కించాయి. ప్రమాణ స్వీకార సమయంలో ముందుగా చర్చకు వచ్చిన వారిలో ఏ ఒక్కరి పేరు లేకుండా మేయర్‌గా మూడో డివిజన్‌కు చెందిన గుమాల మమత పేరును ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది.
వన్.. టూ.. త్రీ.. ఫోర్..
మహబూబ్‌నగర్ మేయర్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. ఈ పదవిపై 49వ డివిజన్ నుంచి గెలుపొందిన ప్రసన్న ఆనంద్‌గౌడ్‌తోపాటు ఎన్పీ వెంకటేష్ కూతురు ఎన్పీ నేహా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న నేహా, స్వప్న ఓటమి చెందడంతో ప్రసన్నకే పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే క్యాంప్‌లో 39వ డివిజన్‌లో గెలుపొందిన సిరాజ్‌ఖాద్రి భార్య హజీరా బేగం పేరు ప్రతిపాదనకు వచ్చింది. డీసీసీ వర్గ నేతలు విభేదించి ప్రసన్న పేరును సూచించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే, ఆయన వర్గం ప్రసన్నకు ససేమిరా అనడంతోపాటు హజీరా బేగం వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో డీసీసీ నేతలు వారికి చెప్పకుండా.. క్యాంప్ నుంచి అర్ధంతరంగా మహబూబ్‌నగర్‌కు వచ్చారు. ఈ క్రమంలో పార్టీ పెద్దల సూచన మేరకు క్యాంప్ చీరాల నుంచి హైదరాబాద్‌కు మారగా.. డీసీసీ వర్గ నేతలు సైతం హైదరాబాద్‌లోని శిబిరానికి వెళ్లారు. అక్కడ చర్చల్లో మేయర్‌గా ప్రసన్న, హజీరాబేగం కాకుండా సీబీ పూజిత.. చివరకు వాణిశ్రీ ప్రశాంత్ ముదిరాజ్ పేరు తెరపైకి వచ్చినట్లు వినికిడి.
శిబిరంలోకి పోలీసుల రాకతో..
చర్చల తతంగం నడుస్తున్న క్రమంలో కాంగ్రెస్‌కు సంబంధించిన రాష్ట్ర, జాతీయ స్థాయి ముఖ్యనేతల నుంచి ఓ కార్పొరేటర్‌కు మేయర్ పదవి ఇవ్వాలని ముఖ్య నేతకు ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఆమెకు ఇచ్చిన పక్షంలో ముఖ్య నేత వర్గానికి చెందిన నాయకులు మా దారి మేం చూసుకుంటామని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో తాను చెప్పిక వారికే మేయర్ పదవి ఇవ్వాలని.. లేకుంటే తాను తీసుకునే నిర్ణయానికి మీరే బాధ్యులవుతారని పెద్దలకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. సదరు కార్పొరేటర్ భర్తకు, మరో ముగ్గురు నాయకుల మధ్య ఆదివారం రాత్రి మాటల యుద్ధం చోటుచేసుకున్నట్లు వినికిడి. ఈ క్రమంలో సోమవారం ఉదయం మేయర్ ఆశావహ అభ్యర్థి ప్రసన్న భర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్‌ను శంషాబాద్ వద్ద పోలీసులు అరెస్టు చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే క్యాంప్ సమన్వయకర్త, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆనంద్‌గౌడ్ బస్సులో మహబూబ్‌నగర్‌కు వచ్చారు. ఆనంద్‌గౌడ్ అరెస్టు వదంతు అని, వాటిని నమ్మొద్దని అనిరుధ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
డీసీసీ, ఎమ్మెల్యే, ఆయన వర్గం మధ్య విభేదాలు బహిర్గతం
వర్గాల వారీగా ఆధిపత్యం చుట్టే
తిరిగిన నేతల రాజకీయాలు
చీరాల నుంచి హైదరాబాద్‌కు మారిన క్యాంప్‌లో అనూహ్య ఘటనలు
తొలుత చర్చకు వచ్చిన ముగ్గురు కాదని కొత్త పేరు తెరపైకి..
చివరకు ముదిరాజ్ మహిళ మమతకు దక్కిన మేయర్ గిరి


