నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతు పనుల దృష్ట్యా మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33కేవీ ఫీడర్లలోని వనపర్తి పట్టణం, రూరల్ గ్రామాలతో పాటు పాన్‌గల్, గోపాల్‌పేట, ఏదుల, పెబ్బేరు, రేవల్లి, పెద్దమందడి, కొత్తకోట మండలాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గుర్తించి సహకరించాలని ఆయన కోరారు.
పాఠశాలల మూసివేత ఉపసంహరించుకోవాలి
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలు మూసివేయాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి అన్నారు. సోమవారం మండలంలోని హాజీపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన డీటీఎఫ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జీఓ నం.25న వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ జీఓ ద్వారా గ్రామాలు, తండాల్లో పాఠశాలలను మూసివేయడం అనేది సరికాదన్నారు. పాఠశాలల విలీనాన్ని, మూసివేయకుండా ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, తరగతికి ఒక ఉపాధ్యాయుని, తరగతికొక గది నిర్మాణం చేసి పేదవర్గాల బిడ్డలకు నైపుణ్యం కలిగిన గుణాత్మకమైన విద్యను అందించాలని కోరారు. ప్రభుత్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, విద్యారంగంలో వస్తున్న మార్పులను పేద వర్గాలకు అనుకూలంగా ఉండే శాసీ్త్రయ, సమానమైన విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలన్నారు. అనంతరం అచ్చంపేట మండల డీటీఎఫ్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా గోపాలమ్మ, శంకర్, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్, కార్యదర్శులుగా రామంజలి, విజయశాంతి, ఖాదర్‌పాషా, జోత్స్న జిల్లా కౌన్సిల్ సభ్యులుగా నర్సింహులు, మోతీరాం, నాగేశ్వరరావు, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా కృష్ణవేణి, సభ్యులుగా రాజు, కృష్ణయ్య ఎన్నికయ్యారు. సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు శంకర్ రాథోడ్, బల్మూరు మండల అధ్యక్షులు నాగరాజు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
పల్లి @ రూ.9,776
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.9,776, కనిష్టంగా రూ.8,212, సరాసరిగా రూ.9,289 వ్యాపారులు కొనుగోలు చేశారు. సోమవారం మార్కెట్ యార్డుకు 760 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చిన ట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


