
రెండు రోజుల్లో 3,900 మె.ట. యూరియా రాక
ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌లోని పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి.. రైతులకు యూరియా పంపిణీపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం నాటికి జిల్లాకు 2,600 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని.. 27న మరో 1,300 మెట్రి క్ టన్నుల యూరియా వస్తుందని వివరించారు. జిల్లాలోని 15 సొసైటీల పరిధిలో గతేడాది 11వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. ఈఏడాది ఇదివరకే 13వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వెల్లడించారు. పీఏసీఎస్ కార్యాలయా ల్లో యూరియా ధర తక్కువగా ఉండటంతో రైతు లు అధికంగా తీసుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1.20కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని.. వర్షాలు సమృద్ధిగా కురియడంతో యూరియా అవసరం పెరిగిందన్నారు. ఒక ఎకరా కు ఒక బస్తా యూరియా వేసినా 1.20 కోట్ల మెట్రిక్ టన్నులు అవసరమవుతుందన్నారు. కొన్ని పంటలకు రెండు లేదా మూడు బస్తాలు వేయాల్సి రావడంతోనే కొరత కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి 8.50లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇదివకు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే కొరత సమస్యే ఉండదన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా ఉన్నారు.