రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
పాన్‌గల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా సహకార అధికారి (డీసీఓ) రాణి ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రాల వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాలని, తేమశాతం, సన్న, దొడ్డురకం ధాన్యం గుర్తింపునకు యంత్రాలు, రైతుల వివరాల రికార్డు తప్పక ఉండాలన్నారు. అలాగే తాలు, చెత్త లేకుండా చూసి ధాన్యం తూకం చేయాలని, సేకరణలో జాప్యం చేయొద్దని.. ఆలస్యం జరిగితే కారణాలను రైతులకు వివరించాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాలు పేరుతో తరుగు, ధాన్యం తరలింపునకు లారీలు రాక కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని పలువురు రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడీఏ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ రమేష్‌బాబు, సీనియర్ అడిటర్ బీక్యానాయక్, మహబూబ్‌అలీ, కిరణ్, రాజునాయక్, ఏఓలు రాజవర్ధన్‌రెడ్డి, డాకేశ్వర్‌గౌడ్, మురళీధర్, సీఈఓ భాస్కర్‌గౌడ్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
రేపు జాబ్ మేళా
వనపర్తి టౌన్: జిల్లాలోని నిరుద్యోగులకు వనపర్తి, హైదరాబాద్‌లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకుగాను జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో పీఎంకేకే సహకారంతో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని పీఎంకేకేలో జరిగే జాజ్ మేళాకు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి పది, ఐటీఐ, ఏదైన డిగ్రీ, బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ చదివిన వారు అర్హులని.. ఎంపికై న వారికి శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు అన్ని ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 99485 68830, 77990 73053, 91753 05435 సంప్రదించాలన్నారు.
15, 16న విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్‌నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్‌లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్‌లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.


