మత్తు రహిత జిల్లాగా మారుద్దాం
వనపర్తి: జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి నార్కోటిక్, నషా ముక్త్ భారత్ సమీక్షలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని, విద్యాశాఖ అధికారులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా ఉంచి మత్తు పదార్థాల విక్రయం, రవాణాను అరికట్టాలని కోరారు. ఒకప్పుడు పట్టణాలకే పరితమైన గంజాయి వినియోగం రానురాను గ్రామీణ ప్రాంతాలకు పాకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ.. పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, నిఘా ఉంచాలని కోరారు. విద్యాలయాలు, ఆస్పత్రులకు 100 మీటర్ల పరిధిలో పాన్, గుట్కా, సిగరెట్ వంటివి అమ్మకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ క్యాంపెయిన్‌లు నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల ఆవరణలో మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు. డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలో 2017 నుంచి గంజాయి కేసులు నమోదవుతున్నాయని, ఇటీవల వీపనగండ్ల మండలంలో ఓ పశువుల కాపరి గడ్డి వాములో గంజాయి దాచిన ఉదంతం వెలుగు చూసిందని తెలిపారు. అనంతరం మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, ఆబ్కారీ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


