అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బందులు
పాన్‌గల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం చేయకపోవడం, తూకం చేశాక మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తుండటంతో వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని వివరించారు. అలాగే తాలు పేరుతో మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారని.. ఇది సరికాదన్నారు. జిల్లా అధికారులు కలగజేసుకొని ధాన్యం తూకం త్వరగా పూర్తి చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లు లు, గోదాములకు తరలించేలా చూడాలని కోరారు. సమస్య పరిష్కారంగాకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్, సీఐటీయూ జిల్లా నాయకుడు వెంకటయ్య, ప్రజాసంఘాల నాయకులు ఆంజనేయులు, శేఖర్, మల్లేష్, భాస్కర్, కృష్ణయ్య, వెంకటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.


