తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
వనపర్తి: అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చిట్యాల మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసింది. శనివారం ఉదయం ఆయన మార్కెట్‌యార్డ్‌ను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మార్కెట్, పౌరసరఫరాలశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని.. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని మార్కెటింగ్‌శాఖ అధికారికి సూచించారు.


