● 55 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలి
● పెండింగ్ రెమ్యూనరేషన్ చెల్లించాలి
● కలెక్టర్‌కు ఫ్యాప్టో వినతి
విజయనగరం అర్బన్: రానున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల కేటాయింపు, పారితోషికం, మినహాయింపు, తదితర అంశాల్లో ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఆర్వో విధులు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులను ఒక దశ ఎన్నికలకే పరిమితం చేయాలని కోరారు. 55 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, అనారోగ్య సమస్య లు, ఇతర అనివార్య కారణాలున్న సిబ్బందికి కూడా వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పత్రాలు, స్వస్తిక్ ముద్రలు తదితర సామగ్రిని నాణ్యతతో అందించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ మండలాలతో సంబంధం లేకుండా ఒకే విధమైన పారితోషికం చెల్లించాలని, గత ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న కౌంటింగ్ రెమ్యునరేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. విధులు నిర్వహించిన మరుసటి రోజు ఉద్యోగులకు తప్పనిసరిగా ఓడీ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఫ్యాప్టో నాయకులు డి.శ్యామ్, కె.శ్రీనివాసరావు, టి.సన్యాసిరాజు, జి.గౌరీదేవి, ఎస్.రాంబాబు, తదితరులు ఉన్నారు.
పుణ్యక్షేత్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
విజయనగరం టౌన్: కార్తీకమాసం సందర్భంగా జిల్లాలోని పుణ్యక్షేత్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్‌లు చోరీ జరిగే అవకాశం ఉన్నందున భక్తులు వ్యక్తిగత భద్రతపై జాగ్రత్త వహించాలని కోరారు. నదీతీరాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. ఆపద సమయంలో డయల్ 112, 100కి ఫోన్ చేయాలని కోరారు.


