న్యూస్రీల్
సోమవారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
బెంబేలెత్తిస్తున్న బియ్యం ధరలు!
● 25 కేజీల బస్తాకు రూ.800 నుంచి 1000 వరకు పెరుగుదల ● ప్రజలపై తీవ్ర ప్రభావం ● నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
ఆలయం వద్ద చాటింపు వేస్తున్న దృశ్యం
బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. ఐదు నెలల క్రితం కేజీ బియ్యం రూ.50 ఉంటే ఇప్పుడు రూ.100 అయింది. దీంతో గంజి అన్నం కూడా తినే పరిస్థితి లేదు. కరువు వల్ల పనులు కూడా దొరకడం లేదు. రూ.100 పెట్టి బియ్యం కొనాలంటే ఇబ్బందిగా ఉంది. బ్రతకడం కష్టంగా ఉంది.
– ఎస్.హైమావతి, గృహణి,
మెంటాడ మండలం
గతంలో రూ. 1000 నుంచి రూ.1200 పెడితే 25 కేజీల బియ్యం బస్తా వచ్చేది. ఇప్పుడు రూ.2వేలు నుంచి రూ.2500 వరకు పెడితేగాని బియ్యం బస్తా రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మాలాంటి సామన్యుడి జీవనం కష్టంగా మారింది.
– కె.రాజు, విజయనగరం మండలం
విజయనగరం ఫోర్ట్:
పేద, సామాన్య ప్రజలు కడుపు నిండా తినే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో లేకుండా పోయింది. పప్పు అన్నం మాట దేవుడు ఎరుగు గంజి అన్నం కూడా తినే పరిస్థితి లేదు. బియ్యం ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. బియ్యం ధరలు చూసి గుండె ఆగినంత పనవుతుంది. పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రజలపైన బియ్యం ధరల పెరుగు దల ప్రభావం పడుతుంది. జిల్లాలో 70 శాతం మంది ప్రజలు పేద, సామన్య మధ్య తరగతివారే. వీరిలో అధికశాతం మంది రెక్కాడితేగాని కడుపు నిండని పరిస్థితి. జిల్లాలో ఏర్పడ్డ కరువు పరిస్థితుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తరుణంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
బస్తాకు రూ.800 నుంచి రూ.1000 వరకు పెరుగుదల
బియ్యం ధరలు గత ఐదు నెలల కాలంలో భారీగా పెరిగాయి. 25 కేజీల బస్తాకు రూ.800 నుంచి రూ.1000 వరకు పెరిగింది. మే నెలలో 25 కేజీల బస్తా రూ.1200 నుంచి రూ.1500 వరకు రకాన్ని బట్టి ఉండేది. ప్రస్తుతం రూ.2 వేలు నుంచి రూ. 2500 వరకు పెరిగింది. కేజీ రూ.50 నుంచి రూ.60 ఉన్న బియ్యం ఇప్పుడు రూ.80 నుంచి రూ.100కు చేరింది.
ప్రజలపై తీవ్ర ప్రభావం
బియ్యం ధరలు పెరగడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. జిల్లాలో 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి నెలకు 25 కేజీల వరకు వినియోగిస్తారు. ఈ లెక్కన నెలకు 15000 క్వింటాళ్లు వరకు బియ్యం వినియోగం అవుతాయి. బియ్యం ధరలు పెరగడం వల్ల నెలకు రూ.6 కోట్ల వరకు ప్రజలపై భారం పడనుంది.
ధరల నియంత్రణలో సర్కార్ విఫలం
ధరలు పెరిగినప్పుడు వాటిని ప్రభుత్వం అదుపు చేయాలి. ధరలు కట్టడి చేసి ప్రజలకు అందుబాటులో ధరలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ అటువంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వంలో కానరావడం లేదు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.


