కోడి గొడవలో అడ్డొచ్చిన వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

కోడి గొడవలో అడ్డొచ్చిన వ్యక్తి హత్య

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

కోడి గొడవలో అడ్డొచ్చిన వ్యక్తి హత్య వివాహత అనుమానాస్పద మృతి..

గంట్యాడ: కోడి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. వివాదాన్ని సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కత్తితో పొడిచి హతమార్చిన ఘటన గంట్యాడ మండలం, రేగూరు గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..డి.కె.పర్తి పంచాయతీ పరిధి రేగూరు గ్రామానికి చెందిన నేగలి పోలయ్య(35) గురువారం రాత్రి తన భార్యతో కోడి విషయంలో గొడవపడ్డాడు. అదే గ్రామానికి చెందిన నేగలి గంగులు అలియాస్‌ గంగారాజు(41) జోక్యం చేసుకుని, భార్యను ఎందుకు కొడుతున్నావంటూ పోలయ్యను వారించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పోలయ్య..కోడిని కోసేందుకు తన వద్ద ఉన్న కత్తితో గంగులు ఛాతీలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై గంగులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న గంట్యాడ ఎస్సై కె.లక్ష్మణరావు, ఇన్‌చార్జి సీఐ టి.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించారు. మృతుడి మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

భామిని: మండలంలోని దిమ్మిడిజోలకు చెందిన వివాహిత కేవటి సరస్వతి(36) శుక్రవారం చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు బత్తిలి ఎస్సై కె.రవీంద్ర తెలిపారు.దిమ్మిడిజోల–లోవగూడల మధ్య తోటలో చెట్టుకు వేలాడుతున్న సరస్వతి(36) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించారు. మూడేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో దిమ్మిడిజోల వచ్చి తండ్రి కేవటి ఆదినారాయణ ఇంటిలో సరస్వతి ఉంటోంది. రోజువారీ కూలి పనులతో జీవనం సాగిస్తున్న తరుణంలో ఘనసరకు చెందిన నారాయణ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడిందని దాని కారణంగా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై మృతురాలి తండ్రి ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కూతురు సరస్వతి మృతికి ఘనసరకు చెందిన నారాయణే కారణమని పేర్కొన్నాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement