చీపురుపల్లి: పట్టణంలోని మెయిన్రోడ్లో అర్ధరాత్రి సమయంలో వాహనాలు అటకాయించి, అల్లరి చేసి, డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆకతాయిలను చీపురుపల్లి ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. అర్ధరాత్రి సమయంలో వాహనదారులను అడ్డగించి భయాందోళనకు గురి చేసిన నలుగురు యువకులను గుర్తించారు. ఈ మేరకు చీపురుపల్లిలోని కుమ్మరికాలనీకి చెందిన శఠగోపం కార్తీక్, అలజంగి కార్తీక్, గరివిడి మండలంలోని కేఎల్.పురం గ్రామానికి చెందిన ముల్లు దుర్గాప్రసాద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. నాలుగో యువకుడు రాజాం పట్టణానికి చెందిన వ్యక్తి అని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని మెయిన్రోడ్లో ఈ సంఘటన ఈ నెల 12న అర్ధరాత్రి జరిగింది. దీనిపై ఈ నెల 14న సాక్షి పత్రికలో ‘అర్థరాత్రి గంజాయిబాబుల అలజడి’ శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు నిర్వహించి మెయిన్రోడ్లో సంఘటన జరిగిన స్థలంలో సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించారు. దీంతో పాటు చీపురుపల్లి నుంచి శివరాం గ్రామానికి టాటామ్యాజిక్లో వెళ్తున్న హరిబాబు అనే వ్యక్తిని రెడ్డిపేట తోటపల్లి కాలువ వద్ద అటకాయించి ప్రాణభయం కలిగించి డబ్బులు లాగేశారు. దీనిపై బాధితుడు హరిబాబు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో దారిదోపిడీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.


