రాకాసి రీచ్‌లు | - | Sakshi
Sakshi News home page

రాకాసి రీచ్‌లు

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

●

నాగావళి నదిలో ఫొక్లెయిన్‌తో ఇసుక తవ్వకాలు (ఫైల్‌)

రాజాం/రేగిడి/సంతకవిటి/వంగర:

ఇసుక అక్రమ తవ్వకాలతో నాగావళి నది గుల్లవుతోంది. చిన్నపాటి వరదలకు సైతం పోటెత్తు తోంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న తవ్వకాలు, ఇసుక తరలింపునకు నదిలో రోడ్లు నిర్మించడంతో నీటి ప్రవాహం దిశమారి ఊళ్లను ముంచెత్తుతోంది. పంటలను ముంచేస్తోంది. నదిని ఆనుకుని ఉన్న పంట పొలాలు నదిలో కలిసిపోతున్నాయి. ఓ వైపు నదీ తీరం ప్రమాదకరంగా మారుతుండగా, మరో వైపు నది నుంచి ఇసుకను తరలించేందుకు వస్తున్న భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ఛిద్రంగా, ప్రమాద కరంగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే కొట్టుకుపోయి ప్రజలకు రవాణా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రజాసంక్షేమానికి పాటుపడాల్సిన పాలకులు తమ ఆర్థిక సంక్షేమానికి రోడ్లు, నదులను ధ్వంసం చేస్తున్నారు. నిబంధనలతో కట్టడిచేయాల్సిన రెవెన్యూ అధికారులు ప్రతీనెల అందే ముడుపులకు దాసోహం అవ్వడంతో నదీతీరం సమస్యలతీరంగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

● నిబంధనలు కాదని అక్రమ రీచ్‌ల నిర్వహణ

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాజాం నియోజకవర్గంలోని వంగర, రేగిడి, సంతకవిటి మండల్లో ఇసుక రీచ్‌లు పెరిగిపోయాయి. వంగరలో నిన్నమొన్నటివరకూ అనాధికారిక ఇసుక రీచ్‌ ను నిర్వహించారు. రేగిడిలో బొడ్డవలస, కొమెర వెంకటాపురంతో పాటు ఖండ్యాం వద్ద ఇసుకరీచ్‌ను నిర్వహిస్తున్నారు. సంతకవిటిలో తమరాం, హొంజరాం ప్రాంతాల్లో ఇసుకరీచ్‌లు కొనసాగుతున్నాయి. ఈ రీచ్‌లు వద్ద నిబంధనలు అతిక్రమించి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుండడంతో నాగావళి నదీగర్భం గుల్లగా మారుతోంది. నదీ ప్రవాహం దిశమారి వరద ఊళ్లను ముంచుతోంది. రీచ్‌ నిర్వాహకులకు మాత్రం ఇసుక వ్యాపారం రూ.కోట్లు కురిపిస్తోంది.

రేగిడి మండలం ఖండ్యాం వద్ద మంజూరైన ఇసుకరీచ్‌ సంతకవిటి మండలం జావాం వరకూ విస్తరించింది. ఈ రీచ్‌ను కేవలం ఎకరా నుంచి రెండెకరాలు విస్తీర్ణంలో నిర్వహించాల్సి ఉండగా పదిహేను ఎకరాలు దాటి నాగావళి నదీ గర్భాన్ని ఆక్రమించారు. సంతకవిటి మండలంలో 34 పంచాయతీలకు తాగునీటిని అందించే రూ.90 కోట్ల రక్షిత మంచినీటి పథకం ఫిల్టర్‌ బావుల వద్ద నేరుగా కిలోమీటరు మేర నదిలో రోడ్డును వేసి తవ్వకాలు చేస్తున్నారు. ఈ రోడ్డు భారీగా వేయడంతో పాటు రెండేళ్లుగా భారీ లారీలు ప్రయాణాలతో రోడ్డు గట్టిగా మారిపోయింది. ఇటీవల నదిలో వచ్చిన నీటి ప్రవాహాన్ని ఈ రోడ్డు అడ్డుకోవడంతో కెమెర, ఖండ్యాం, జావాం ప్రాంతాల్లోని నాగావళి నదీతీరంలోని వరి, చెరకు పంటలు నీటమునిగాయి. 80 ఎకరాల మేర పొలాలు మొత్తం నీటిలో తడిచి బురదపట్టేశాయి. ఈ రీచ్‌ నిర్వహణకు వేసిన రోడ్డు కారణంగానే వరద పోటెత్తి ఓపెన్‌హెడ్‌ కాలువలు ద్వారా పొలాల్లోకి పరుగులెత్తింది. ఖండ్యాం, మాధవరాయపురం, జావాం, శంకరపేట, వాసుదేవపట్నం, చిన్నయ్యపేట, కాకరాపల్లి, మందరాడ, రామారాయపురం, మల్లయ్యపేట, బూరాడపేట, చిత్తారిపురం, పోడలి, గుజ్జన్నపేట, వాల్తేరు, పనసపేట ప్రాంతాలకు చెందిన పంటపొలాలను మొత్తం ముంచేసింది.

జావాం నుంచి ఖండ్యాం వరకూ నాగావళి నదిలో కిలోమీటరు మేర వేసిన ఇసుకరీచ్‌ రోడ్డు

ఈ రోడ్డు కారణంగానే వరద

ముంచెత్తిందన్న కారణంతో రైతులు

ఇటీవల తవ్వేశారిలా...

నాగావళి నది వరదకు

ఇసుకరీచ్‌ సమీపంలో ముంపునకు గురైన వరి పంట

పంట మొత్తం పోయింది...

నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో నీటి ప్రవాహం దిశ మారి మా పొలాలను ముంచేసింది. వరి, చెరకు, అరటి తోటలు నష్టపోయాయి. రూ.2 లక్షల మేర పంట నష్టం వాటిల్లింది. ఇలా అయితే రైతు బతికేదెలా?.

– నక్క తిరుపతిరావు, ఖండ్యాం, రేగిడి మండలం

ఎన్ని దఫాలు ఫిర్యాదుచేసినా.

ఇసుక అక్రమ తవ్వకాలతో ఖండ్యాం–జావాం గ్రామాల మధ్య నాగావళి నది ప్రమాదకరంగా మారింది. దీనిపై సంతకవిటి తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. మొన్నటి వరదలకు నదీతీరంలో ఎస్సీ రైతులకు చెందిన పొలాలన్నీ కొట్టుకుపోయాయి. రీచ్‌ల నిర్వాహకులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడ్తామని బెదిరిస్తున్నారు. మా వవెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడి ఇసుకరీచ్‌ కారణంగా మా గ్రామానికి వచ్చే రోడ్డు మొత్తం పోయింది. నదినీరు ఎగపోటుతో వరదనీరు పొలాలను ముంచెత్తింది. – బోనెల ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌,

జావాం, సంతకవిటి మండలం

చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి..

నాగావళి నది నుంచి భారీగా ఇసుకను తోడేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు మొత్తం పాడయ్యాయి. నదిలో నీటి ప్రవాహం గట్లపైకి ఎగబాకి పంటపొలాలను ముంచేసింది. ఇసుక లారీలు తిరుగుతున్న సమయంలో రాళ్లు పక్కనున్న ప్రయాణికులపై తుల్లి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతమంది అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేదు.

– దాసరి దాలినాయుడు, మాజీ సర్పంచ్‌,

శంకరపేట, సంతకవిటి మండలం

అడ్డుకుంటే గాండ్రింపు

సుమారు 50 నుంచి 70 టన్నుల ఇసుక లారీల రాకపోకలతో రేగిడి, సంతకవిటి మండలాల్లోని నాగావళినదీ తీర గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా మారాయి. పలుసార్లు యువత లారీలను అడ్డుకున్నారు. అయితే, రాజాం నియోజకవర్గ ప్రజాప్రతినిధి సోదరుడు తన గూండాగిరీతో యువతపై గాండ్రిస్తూ, అధికారులతో హెచ్చరికలు జారీచేయిస్తూ ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇలాగే మరికొన్నాళ్లు ఇసుక అక్రమ తవ్వకాలు జరిగితే నాగావళి నదీ తీరంలోని పంటల పొలాలతో పాటు ఊళ్లు కూడా వరదబారిని చిక్కుకోవడం ఖాయమన్న వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. ఈ అరాచకాలను మరో రెండున్నరేళ్లు ఎలా భరించాలన్న చర్చ తీర గ్రామాల్లో సాగుతోంది.

రోడ్డేసి.. తవ్వేసి.. ముంచేసి..

నాగావళిలో ఇష్టానుసారం

ఇసుక రీచ్‌ల నిర్వహణ

అక్రమ తవ్వకాలతో మారిన

నదీప్రవాహ దిశ

నదీ తీరంలో కోతకు గురవుతున్న

పంటల పొలాలు

ఇసుక లారీల రాకపోకలతో

అధ్వానంగా మారిన రోడ్లు

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ రీచ్‌ల నిర్వహణ

మామూళ్ల మత్తులో రెవెన్యూ

అధికారులు!

నష్టపోతున్న రైతులు

పొలాలు కొట్టుకుపోతున్నాయి..

నాగావళి నదీ ప్రవాహం జావాం గ్రామం వైపు తిరిగింది. వరద నీరు జావాం, కేఆర్‌ పురం, రంగారాయపురాన్ని తాకుతోంది. ఇటీవల వచ్చిన వరదలకు నదీ తీరంలో తమ ఎకరాపొలం కొట్టుకుపోయింది. పొలాలు గట్లు కోతకు గురౌతున్నాయి. ప్రవాహ దిశ ఇటు వైపు మల్లడంతో ఈ సమస్య వచ్చింది. గతంలో ఇటువైపు ప్రవాహం ఉండేది కాదు. మొన్నవచ్చిన వరదలకు మా పంపుషెడ్డు మోటారు, బెల్లం గానుగ పరికరాలు మొత్తం పాడయ్యాయి.

– జె.చినరాము, రైతు, జావాం, సంతకవిటి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement