డీఎస్సీ అక్రమాలపై.. యువ గర్జన | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై.. యువ గర్జన

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

విజయనగరం:

చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, మోసకారి పాలనపై యువజనం గర్జించింది. విద్యార్థిలోకం గళ మెత్తింది. నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమాధానం చెప్పాలని, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నారు. విద్యార్థులకు రావాల్సిన రూ.12000 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వాప్త పిలుపులో భాగంగా యువతకు, విద్యార్థులకు కూటమి సర్కారు చేస్తున్న అన్యాయంపై తక్షణమే మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరసన విజయవంతమైంది. జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు నిరసన ర్యాలీలో పాల్గొని తమ గళం వినిపించారు. మెగా డీఎస్సీ కాదు.. ఇది దగా డీఎస్సీ.., టెట్‌ లేదు... డీఎస్సీ లేదు.. డీల్‌ ఉంటే ఉద్యోగం ఖాయం.. పతక విజేతలు బయట.. పైరవీ విజేతలకు అందలం... అర్హతను పాతిపెట్టి అవినీతికి పట్టం కట్టారు.. తప్పు చేయకుంటే సీబీఐ విచారణకు భయమెందుకు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక న్యూపూర్ణ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీలో భాగంగా ముందుగా పార్టీ నాయకులు దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంటస్తంభం జంక్షన్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి ఆలయం వద్దకు చేరుకుని ప్రజలకు మంచి జరిగే పాలన అందించేలా కూటమి ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ టెంకాయలు కొట్టి పూజలు చేశారు.

కార్యక్రమంలో ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, కార్పొరేషన్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌.వి.వి.రాజేష్‌, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్‌, బడ్డుకొండ మణిదీప్‌నాయుడు, ప్రదీప్‌నాయుడు, బెల్లాన వంశీకృష్ణ, చెల్లూరు భార్గవ్‌, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు, యువత జీవితాలతో ఆటలా..?

యువత, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై బాధ్యత గల ప్రతిపక్షంగా పోరాటం చేస్తాం. మంత్రి నారా లోకేష్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదు. యువత, విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం సరికాదు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టకుంటే ఢిల్లీలో జరిగిన ఘటన రాష్ట్రంలో పునరావృతం అవుతుంది. కష్టపడి చదువుకునే నిరుద్యోగ యువతను మోసం చేయడం నేరం. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నారా లోకేష్‌ ఏం చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇస్తామని ప్రకటించిన హమీ అమలు ఏమైంది?. – బొత్స అనూష, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు, విజయనగరం

‘ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్మేశారు’

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యంతో అర్హులు ఉద్యోగాలకు దూరమయ్యారు. సంతలో కూరగాయలు అమ్ముకున్నట్టు ఉపాధ్యాయ ఉద్యోగాలు రూ.లక్షలకు అమ్మేశారు. ఎన్నికలు వచ్చే ప్రతిసారి యువతకు హామీలు ఇవ్వడం, వాటిని అమలుచేయకుండా మోసగించడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది.

– అల్లు అవినాష్‌, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు

మెగా కాదు... దగా డీఎస్సీ

కేంద్రమంత్రి తరహాలో నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

డీఎస్సీ నియామకాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి

రూ.12 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో

విజయనగరం జిల్లా కేంద్రంలో

నిరసన ర్యాలీ

యువత, విద్యార్థులకు అండగా వైఎస్సార్‌సీపీ

ప్రభుత్వానికి మంచి బుద్ధిని

ప్రసాదించాలంటూ పైడితల్లికి పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement