● క్వింటాకు రూ.800 చొప్పున పెరిగిన బియ్యం ధరలు
● నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు
● బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు
ఈ చిత్రంలో చేతిలో చిన్న సంచితో బియ్యం చూపిస్తున్నది రామభద్రపురం గ్రామానికి చెందిన కనపాక బాబ్జి. ఇతడు రోజూ కూలీ పనిచేసుకుంటూ జీవనం స్తాస్తున్నాడు. ఈయన ప్రతినెలా బియ్యం కొనుగోలు చేస్తాడు. గత నెలలో 5 కిలోల బియ్యం రూ.300లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం అవే బియ్యం రూ.360కు ధర పెరగడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈయన జూన్ నెలవరకు ఇంట్లో సరిపడా సరుకులకు సుమారు రూ.3 వేలు ఖర్చుపెట్టగా, ఇప్పుడు ఆ ఖర్చు రూ.4వేలకు చేరిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.
రామభద్రపురం:
నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి దడపుట్టిస్తున్నాయి. బియ్యంతో పాటు వంట నూనె, కందిపప్పు, వేరుశనగ పలుకులు, పంచదార, తదితర నిత్యావసర వస్తువుల ధరలు నింగినితాకుతున్నాయి. సామాన్యుల బతుకు భారంగా మారింది. ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం నుంచి దొడ్డ బియ్యం వరకు నెలరోజుల్లో 20 నుంచి 40 శాతం ధరలు పెరగడంతో సామాన్యులకు రెండు పూటలా గడవడం కష్టంగా మారింది. గతనెలలో రూ.1450 ఉండే 25 కిలోల సన్నబియ్యం బస్తా ప్రస్తుతం రూ.1650కు చేరింది. తక్కువ రకం కర్నూలు రకం బియ్యం గత నెలలో రూ.1050లు ఉండగా ప్రస్తుతం రూ.1500లకు చేరింది. ప్రతి క్వింటా బియ్యం బస్తాకు నెలరోజుల్లో దాదాపు రూ.800లు పెరిగిందటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కూరగాయల ధరలు కూడా అమాంతం పెరగడంతో పేదలు బెంబేలెత్తిపోతున్నారు. బతుకు ఎలా సాగేదంటూ ఆందోళన చెందుతున్నారు.


