నెల్లిమర్ల రూరల్: కొన్నిసార్లు విజయాలు వ్యక్తిగతంగా నిలుస్తాయి. మరికొన్నిసార్లు అవి ఒక కుటుంబ చరిత్రను సృష్టిస్తాయి. పట్టుదలకు పౌరుషం తోడైతే ఎలా ఉంటుందో గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్–2026 సాక్షిగా జిల్లాకు చెందిన యువకుడు నిరూపించాడు. పురుషుల 79 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్‌బాబు సోమవారం అర్ధరాత్రి చేసిన అద్భుతమైన ‘హిస్టారికల్ లిఫ్ట్’కు అంతర్జాతీయ వేదిక ఫిదా అయ్యింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సరికొత్త గేమ్స్ రికార్డుతో రజత పతకాన్ని ముద్దాడాడు. ఒకప్పుడు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కామన్వెల్త్ వేదికపై పతకం కొట్టి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తే.. ఇప్పుడు ఆయన కుమారుడు అజయ్ వెండి పతకంతో తండ్రి వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాడు.
స్నాచ్‌లో నయా హిస్టరీ..
క్లీన్ అండ్ జెర్క్‌లో సంచలనం
స్నాచ్ విభాగంలో అజయ్ బాబు ఏకంగా 149 కేజీల అసాధారణ బరువు ఎత్తడంతో సరికొత్త కామన్వెల్త్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఘనతతో గ్లాస్గో వేదిక కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తన సర్వ శక్తులను ఒడ్డి ఏకంగా 181 కేజీల బరువును గాల్లోకి లేపాడు. ఆ బరువుతో స్థిరంగా నిలబడిన ఆ కొన్ని సెకెన్ల దృశ్యం భారత క్రీడా చరిత్రలోనే ఒక అద్భుత హిస్టారికల్ లిఫ్ట్‌గా నిలిచింది. మొత్తంగా 330 కేజీల బరువుతో అజయ్ రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయిత్ (331) కేజీలు కేవలం ఒక్క కిలో తేడాతోనే బంగారు పతకాన్ని సాధించాడు.
16 ఏళ్ల తరువాత మార్మోగిన జిల్లా పేరు
గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి అజయ్‌బాబు ఒక్కడే ఎంపికయ్యాడు. త్రుటిలో స్వర్ణం చేజారినప్పటికీ అసాధారణ ప్రతిభతో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక తండ్రి కల దాగి ఉంది. 2010 ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు దేశం తరఫున ఆడి కాంస్య పతకం గెలిచాడు. తండ్రి సాధించిన ఘనతను ఆదర్శంగా తీసుకున్న అజయ్ అనుకున్నట్లే గ్లాస్గో వేదికపై వెండిని ముద్దాడి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అజయ్ సాధించిన విజయంపై స్వగ్రామమైన కొండవెలగాడలో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో పాటు జిల్లా వ్యాప్తంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మె ల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
అజయ్ తండ్రికి సత్కారం
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వల్లూరి అజయ్‌బాబు వెండి పతకం సాధించి కొండవెలగాడ గర్వాన్ని ప్రపంచానికి చాటాడని జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు గదల సన్యాసినాయుడు అన్నారు. కొండవెలగాడలో అజయ్ తండ్రి శ్రీనివాసరావును మంగళవారం ఘనంగా సత్కరించారు. వెయిట్‌లిఫ్టర్లగా తండ్రీకొడుకుల ఘనతను ప్రశంసించారు. వీరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.
కామన్‌వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన అజయ్
149 కేజీల స్నాచ్‌లో రికార్డు
క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు లిఫ్ట్
మొత్తం 330 కేజీల బరువును ఎత్తి
వెండి పతకం
16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ
పోడియంపై జిల్లా పేరు
నాడు తండ్రికి కాంస్యం..
నేడు తనయుడుకి రజతం..


