వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ సాగునీరు అందలేదు. ఉభాల సమయం మించిపోతున్నా సాగునీరు అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 9 మండలాల్లో 31వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. గత ఏడాది జూన్ నెలాఖరు నాటికి సాగునీరు విడుదల చేయగా... ఈ ఏడాది జూలై చివరి వారం వస్తున్నా సాగునీటి సరఫరాను అధికారులు చేపట్టలేదు. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 64.62 మీటర్లు లెవెల్ నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన 3.30 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిలువ ఉంది. ఈ ఏడాది అదే సమయానికి ప్రాజెక్టులో 62.28 మీటర్ల నీటిమట్టం నమోదు కాగా, 1.25 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. గత ఏడాది ఈ సమయానికి 25వేల ఎకరాలకు సాగునీరందించగా ప్రస్తుతం 550 ఎకరాలకు మాత్రమే సాగునీరు సరఫరా చేస్తున్నారు. వంగర మండలంలోని తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు భూములకూ సాగునీరు అందడంలేదు. గత ఏడాది ఈ సమయానికి 6,900 ఎకరాలకు సాగునీరు అందగా, ఈ ఏడాది 1800 ఎకరాలకు సాగునీటిని సరఫరా చేశారు. వర్షాభావం, సాగునీరు అందక కె.కొత్తవలస, కొప్పర, మద్దివలస, ఎం.సీతారాంపురం, కొండచాకరాపల్లి, వంగర, తలగాం, రుషింగి, శివ్వాం తదితర గ్రామాల్లో వరి వెదలు ఎండిపోతున్నాయి.
ప్రస్తుతం మడ్డువలస ప్రాజెక్టు వద్ద 62.28 మీటర్ల మేర ఉన్న సాగునీరు
సాగు కష్టమే....
వర్షాలు పుష్కలంగా కురవకపోతే మడ్డువలస ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా కష్టమే. గత ఏడాది ఈ సమయానికి సగానికి పైగా దమ్ములు పూర్తయ్యాయి. ఈ ఏడాది ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఒక్క ఎకరా నాట్లు వేయలేదు. – బూరాడ వెంకటరావు,
రైతు, మడ్డువలస, వంగర మండలం
సాగునీటికి కటకట
ఈ ఏడాది తోటపల్లి ప్రాజెక్టును నమ్ముకొని పంటలను సాగుచేస్తే సాగునీరు అందడంలేదు. వర్షాలు కురవకపోతే రైతులు పంట కోల్పోవలసిన పరిస్థితి. రైతులకు వలసలు తప్పేలా లేవు.
– గుడివాడ గౌరునాయుడు, తోటపల్లి ఆయకట్టు రైతు, కె.కొత్తవలస, వంగర మండలం


