రైతన్నకు మద్దతు కరువు..! | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు మద్దతు కరువు..!

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

విజయనగరం ఫోర్ట్‌:

పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. కిలోకు పైసల్లో పెంచడం సరికాదని, రైతుకు ఏమాత్రం భరోసా ఇచ్చేలా లేవని వాపోతున్నారు. పంటల సాగు వ్యయం భారీగా పెరిగినప్పటకీ దానికి అనుగుణంగా పంటలకు మద్దతు ధర పెరగలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రకటించిన మద్దతు ధరకు అయినా రైతుల పండించిన పంటను కొనుగోలు చేస్తున్నారా అంటే అదీలేదు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు మద్దతు ధరకు పంటను అమ్ముకోలేని పరిస్థితి. తక్కువ ధరకు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి.

ప్రస్తుతం వరి పంటకు కిలోకు 72 పైసలు చొప్పున క్వింటాకు పెంచింది రూ.72 మాత్రమే. 2025–26 ఖరీఫ్‌లో వరి సాధారణ రకం మద్దతు ధర రూ.2,369 కాగా, 2026–27 ఖరీప్‌లో వరి మద్దతు ధరను రూ.2,441కు పెంచారు. వరి ఏగ్రేడ్‌ రకం మద్దతు ధర రూ.2,389 నుంచి రూ.2,461కు పెంచారు. మొక్కజొన్నలకు క్వింటా రూ.2400 నుంచి రూ.2,410కు పెంచారు. కేవలం రూ.10 మాత్రమే పెంచారు. పెసర పంటకు రూ.8,768 నుంచి రూ. 8,780 కి పెంచారు. కేవలం రూ.12 మాత్రమే పెంచారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కనీసం పెంచిన మద్దతు ధర రైతులకు అందుతుందన్న ధీమా లేకపోతోంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో తక్కువ ధరకే పంటను దళారులకు అమ్మాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

వరి పంటకు పెంచింది రూ.72 మాత్రమే...

పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధర పెంచలేదు

పంటలకు సాగు ఖర్చులు అమాంతం పెరిగాయి. వాటికి అనుగుణంగా మద్దతు ధర పెంచలేదు. రబీలో మొక్కజొన్న పంట క్వింటా మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్ల వ్యాపారులు రూ.1700కు మించి కొనుగోలు చేయలేదు. ధాన్యం 105 కేజీలు రూ.1800కు విక్రయించాల్సి వచ్చింది. మద్దతు ధర అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దీనివల్ల వ్యాపారులు ఎంత అంటే అంతకు పంటను రైతులు విక్రయించుకోవాల్సిన పరిస్థితి. మద్దతు ధర ప్రకటనలకే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. – బుద్దరాజు రాంబాబు,

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

కిలో ధాన్యానికి 72 పైసల ధర పెంపు

మొక్కజొన్నకు 10 పైసలు, పెసలకు

12 పైసలు మాత్రమే పెంపు

ఆందోళనలో రైతన్న

పెట్టుబడి పెరిగిన స్థాయిలో ధర

పెంచలేదంటూ గగ్గోలు

కొనుగోలు కేంద్రాలు లేక మద్దతు

ధర అందని వైనం

Advertisement
 
Advertisement
Advertisement