విజయనగరం ఫోర్ట్:
ఆదాయ లక్ష్య సాధనలో వ్యవసాయ మార్కెట్ కమిటీ( ఏఎంసీ)లు వెనుకబడ్డాయి. నిర్దేశించిన లక్ష్యాన్ని శతశాతం సాధించడంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు అలసత్వం వహిస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్ష్యం సాధించడానికి గడువు కేవలం కొద్ది రోజులే ఉంది. కాని సాధించాల్సిన లక్ష్యం రూ.కోట్లలో ఉంది. నెలల్లో సాధించలేనిది, రోజుల వ్యవధిలో సాధించడం అసాధ్యంగా కనిపిస్తుంది. మార్కెట్ కమిటీలు అలసత్వం వహించడం వల్లే ఆదాయ లక్ష్యాన్ని సాధించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
● జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు
జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ, మెరకముడిదాం, రాజాం ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి.
● మిగిలింది 16 రోజులే..
ఆదాయ లక్ష్యం సాధనకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ కొద్ది రోజుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆదాయ లక్ష్యాన్ని సాధించగలవా... అనేది సందేహంగానే ఉంది.
● 11 నెలల 14 రోజుల్లో రూ.10.95
ఈ నెల 31వ తేదీతో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయ లక్ష్య సాధనకు సంబంధించి గడువు పూర్తవుతుంది. 11 నెలల 14 రోజుల్లో రూ.10.95 కోట్ల ఆదాయాన్ని సాధించారు. ఇంకా గడువు 16 రోజులే ఉంది. ఈ తక్కువ వ్యవధిలో రూ.3.12 కోట్ల ఆదాయం సాధించడం దాదాపు కష్టమే.
● మార్కెట్ కమిటీల ఆదాయం
వచ్చేది వీటి ద్వారానే..
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ఫీజు ద్వారా, మార్కెట్ కమిటీ పరిధిలో ఉండే దుకాణాల అద్దెలు ద్వారా ఆదాయం వస్తుంది. 184 రకాల నోటిఫైడ్ వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తారు. వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వులు, పెసలు, మినుములు, గోగునార, బెల్లం, అరటి, వేరుశనగ, మామిడి, జీడిమామిడి తదితర ఉత్పత్తుల మార్కెట్ ఫీజు ద్వారా ఆదాయం వస్తుంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీల వారీగా లక్ష్యం, సాధించిన ఆదాయం
2025 - 26 లక్ష్యం
రూ.14.07 కోట్లు
జిల్లాలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయ లక్ష్యం రూ.14.07 కోట్లుగా నిర్దేశించారు. ఈ నెల 13నాటికి రూ.10.95 కోట్లు సాధించారు. ఇంకా రూ.3.12 కోట్లు సాధించాల్సి ఉంది. విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, కొత్తవలస, పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీలు తక్కువ ఆదాయాన్ని సాధించాయి. ఈ క్రమంలో మిగిలిన ఆదాయ లక్ష్యం ఎంత వరకు సాధించగలరన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది.


