రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఆహ్వానం

Mar 15 2026 1:31 AM | Updated on Mar 15 2026 1:31 AM

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుకు ఆలయ అధికారులు శనివారం ఆహ్వానం పలికారు. విజయనగరంలోని ఆయన నివాసంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు, మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రామతీర్థంలో జరుగుతున్న నవమి ఏర్పాట్లపై జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈఓకు సూచించారు. డెంకాడ మండలం మోపాడలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది సాయిరామాచార్యులు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

కాట్రగడ వైపు ఏనుగుల పయనం

భామిని: మండలంలోని కాట్రగడ వైపు ఏనుగులు శనివారం పయనమయ్యాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటలను ఆహారంగా తీసుకుంటుండడంతో పంట మొత్తం నాశనం అవుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నేరడి బ్యారేజి వద్ద వరద కాలువలో దిగి ఆవలకు దాటినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నేరడి, కాట్రగడ, బొమ్మిక ప్రాంత పంట పొలాలను తీవ్ర నష్టం కలిగిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు.

19 నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు

గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీరామ వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ పారాయణం, శ్రీరామలక్ష్మీ జపంతో పాటు అష్టో త్తర, సహస్ర నామార్చనలు నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం శ్రీ సీతారామస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీ స్వామివారి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణంలో పాల్గొనే దంపతులు తమ గోత్రనామాలతో రూ.500లు చెల్లించి పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే దంపతులకు ప్రసాదం, శేష వస్త్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల ఉదయం 19న తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో తెలుగు పండితులు పొందూరు సుధాకుమార్‌ శర్మచే ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

108లో ప్రసవం

సీతంపేట: మండలంలోని వెదుల్లవలస గ్రామానికి చెందిన గర్భిణి శనివారం 108లో ప్రసవమైంది. సవర సుమిత్ర అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ రవిబాబు, పైలెట్‌ రమణ గ్రామానికి చేరుకొని గర్భిణీని తీసుకువస్తుండగా దిబ్బగూడ గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని పక్కకు ఆపి సిబ్బంది సుమిత్రకు ప్రసవం చేయించారు. సుమిత్ర మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరు చేసిన సేవలకు గ్రామస్తులు కుటుంబ సభ్యులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement