● 22,961 మంది విద్యార్థుల కోసం
119 పరీక్ష కేంద్రాలు
● పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144,
నో ఫోన్ జోన్ అమలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. శనివారం ఆయన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. పది పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల సమీపంలో జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి గుంపులు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాలను నో ఫోన్ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను ఉదయం 10 గంటల వరకు మాత్రమే పరీక్షలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 119 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 119 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 3 అదనపు డిపార్టుమెంటల్ అధికారులు, 1,210 మంది ఇన్విజిలేటర్లు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ సహకారం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 119 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదే విధంగా ఓసెన్ స్కూల్‌కు చెందిన 631 మంది విద్యార్థులు 8 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల చిరునామా తెలుసుకోవడానికి హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమాచారం కోసం 08922–351399, 7382157686 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ టి.సన్యాసిరాజు పాల్గొన్నారు.


