అందుబాటులో ఉన్నా.. కేటాయింపే! | - | Sakshi
Sakshi News home page

అందుబాటులో ఉన్నా.. కేటాయింపే!

Jan 29 2026 6:02 AM | Updated on Jan 29 2026 6:02 AM

అందుబాటులో ఉన్నా.. కేటాయింపే!

అందుబాటులో ఉన్నా.. కేటాయింపే!

బొబ్బిలి: జిల్లాలో పరిశ్రమల కోసం అదనంగా భూముల కేటాయింపే తప్ప పరిశ్రమలు ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ పార్కులను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తామనడమే తప్ప ఏర్పాటు చేయని టీడీపీ ప్రభుత్వం మరోసారి కూటమిగా అధికారంలోకి వచ్చినా అదే తరహాలో భూముల కేటాయింపునకే ప్రాధాన్యతనిస్తోంది తప్ప ఉన్న భూముల్లో పరిశ్రమలను తీసుకువచ్చే చర్యలు చేపట్టలేదు.

జిల్లాలో అతి పెద్ద, చిన్న తరహా పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిన బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో 1200 ఎకరాల భూములున్నాయి. చిన్న, పెద్ద కలిపి 350 ఎకరాల్లో 145 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 60 పరిశ్రమల వరకూ మూతపడ్డాయి. మరో 220 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఏళ్ల తరబడి ఏపీఐఐసీ వద్ద ఆయా స్థలాలను రెన్యువల్‌ చేసుకుంటున్నారు. మిగిలిన 430 ఎకరాలు పూర్తిగా ఏపీఐఐసీ వద్దే ఉన్నాయి. ఈ భూములు ఇంత పెద్ద విస్తీర్ణంలో(కేటాయించని, కేటాయించి రద్దు చేసినవి)ఉన్నప్పటికీ మరే పరిశ్రమలకూ కేటాయించలేదు. అలాగని దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకూ ఇవ్వడం లేదు. ఎవరయినా దరఖాస్తు చేసుకుంటే మాత్రం కూటమి ప్రభుత్వం వేరే చోట కేటాయిస్తోంది. దీనిపై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ పేరిట

1100 ఎకరాలు

జిల్లాలో పరిశ్రమలు లేకపోయినా విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ పేరిట ఇక్కడ బడా బాబులకు పరిశ్రమల కోసం భూములను కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ పరిశ్రమలు, జీఎంఆర్‌, టాయ్స్‌ పరిశ్రమల పేరిట డెంకాడ, కొత్తవలస, భోగాపురం మండలాల్లో సుమారు 1100 ఎకరాలు కేటాయించేందుకు రంగం సిద్ధమయింది. మరో పక్క బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి, కొట్టక్కి ప్రాంతాల్లో కూడా భూములను వేరే ప్రాజెక్టుల కింద భూములను కేటాయించారు.

ఇదిగో అదిగో అంటూ...

పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం.. ఇదిగో అదిగో అంటూ గ్రోత్‌ సెంటర్‌లో భూములను బడా పారిశ్రామిక వేత్తలకు గతంలో కేటాయించారు. ఇందులో ప్రధానంగా బీకే స్టీల్స్‌ అంటూ సుమారు 230 ఎకరాలు పైబడి ఆ పరిశ్రమకు కేటాయించారు. ఇదే భూమిని పలుమార్లు ఆ సంస్థ యాజమాన్యం హక్కులను రెన్యువల్‌ చేయించుకుంది. చివరికి అది వెనక్కి వెళ్లిపోయింది. అలాగే స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ పరిశ్రమకు 80 ఎకరాలు కేటాయించారు. ఇదీ ఏర్పాటు కాలేదు. అలాగే మోయిల్‌ అనే కేంద్ర ప్రభుత్వ పరిశ్రమకు 112 ఎకరాలు కేటాయించారు. అదీ ఇంకా కానరాలేదు. ఇలానే భూములను కేటాయించాక ఇదిగో అదిగో అంటూనే బొబ్బిలి ప్రాంత వాసులను ఊరించి ఉస్సురనిపిస్తున్న పరిశ్రమల యజమానులెంతో మంది ఉన్నారు. గ్రోత్‌ సెంటర్‌లో పారిశ్రామిక వేత్తల నుంచి వెనక్కి తీసుకున్న భూముల్లో కొత్తగా ఔత్సాహికులకు కేటాయిస్తే కాస్త నమ్మకంగా ఉంటుందని స్థానిక యువత వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమలు ఏర్పాటు కాక మిగిలి ఉన్న భూములు 430 ఎకరాలు

అయినా పరిశ్రమల కోసమంటూ జిల్లాలో మరో 1100 ఎకరాల కేటాయింపు

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ పేరిట

కార్పొరేట్‌లకు భూముల పందేరం

జిల్లాలో పరిశ్రమలకు మాత్రం చర్యలు చేపట్టని కూటమి ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement