వేడుకగా పోలమాంబ అనుపోత్సవం
● వనంగుడికి చేరిన అమ్మవారి ఘటాలు ● అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ● ఫిబ్రవరి 3న మారుజాతర
మక్కువ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, భక్తుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి అనుపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం 3.35 నిమిషాలకు జన్నివారి ఇంటి వద్ద పూజలందుకున్న అమ్మవారి ఘటాలను తిరువీధి కార్యక్రమానికి బయలు దేరి గిరిడ వారింటికి, పూడి, కుప్పిలి వారిళ్లకు వెళ్లి తొలి పూజలందుకొని అనంతరం గ్రామంలో అన్ని వీధులలో అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించారు. తిరిగి మంగళవారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో ప్రధాన రహదారి వద్ద అమ్మవారి గద్దెకు ఘటాలు చేరుకున్నాయి. కాసేపు అమ్మవారు సేదతీరి తిరిగి తిరువీధికి బయలుదేరి, బుధవారం ఉదయం 10 గంటలకు అమ్మవారి ఘటాలు ప్రధానాలయం సమీపంలో ఉన్న యాత్రా స్థలానికి చేరుకున్నాయి. అమ్మవారి గద్దె వద్ద పూజలు నిర్వహించి, భక్తుల మధ్య అమ్మవారికి ఉయ్యాలు కంబాలు కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నుంచి వనంగుడికి బయలు దేరిన అమ్మవారి ఘటాలకు అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు. యాత్రా స్థలం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న వనంగుడికి కాలినడకన అమ్మవారి ఘటాలు బయలుదేరగా, వెనుకన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. యువత కేరింతలు, మేళతాళాలు, తప్పెడుగుళ్లు భక్తులను ఆకట్టుకున్నాయి. వనంగుడి వద్దకు చేరుకున్న ఘటాలను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణలు చేసి అనంతరం వనంగుడిలో అమ్మవారి ఘటాలను ఉంచారు. అనంతరం పూజారి జన్ని పేకాపు భాస్కరరావు, అలియాస్ జగదీశ్వరరావు ఆలయం చుట్టూ మూడుసార్లు తిరిగి కట్టువేశారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని, ఘటాలకు పూజలు చేశారు. సిరిమానోత్సవం కార్యక్రమం అనంతరం చదురుగుడి సమీపంలో నేలపై తిరగేసిన సిరిమాను బండికి భక్తులు పూజలు జరిపారు. వచ్చే నెల 3వ తేదీన పోలమాంబ అమ్మవారు మారు జాతర కార్యక్రమం నిర్వహించనున్నారు.
పోలమాంబను దర్శించుకున్న రాజన్నదొర
పోలమాంబ అమ్మవారిని బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు పీడి క రాజన్నదొర దర్శించుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో రాజన్నదొరను ఈఓ బి.శ్రీనివాస్ స్వాగతించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించా రు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరకు దుశ్శాలువతో సత్కరించారు. మక్కువ, సాలూరు, పాచిపెంట వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లు వెంకటరమణ, జర్జాపు శ్రీను, ముదరాపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ముత్యాలమ్మ పండగకు హాజరైన రాజన్నదొర
కవిరిపల్లి గ్రామదేవత ముత్యాలమ్మ పండగకు, గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు పెంట సంజీవునాయుడు ఆహ్వానం మేరకు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర హాజరయ్యారు. ఆయన వెంట పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు, బూత్ కమిటీ ఇన్‌చార్జ్ మావుడి తిరుపతినాయుడు హాజరయ్యారు.
వేడుకగా పోలమాంబ అనుపోత్సవం


