ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె
● కేంద్ర కార్మిక సంఘాల పిలుపు
విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌పీఆర్ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమ్మె వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి టి.వి.రమణ, ఏఐసీసీటీయూసీ జిల్లా కన్వీనర్ యం.అప్పలరాజు, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ నాయకులు మాట్లాడుతూ, నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్మించారు. లేబర్ కోడ్స్ రద్దుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. సమ్మె విజయవంతానికి ఫిబ్రవరి 1న రౌండ్ టేబుల్ సమావేశం, 9న బైక్ ర్యాలీ, 10, 11 తేదీల్లో ప్రచారం చేపడతామని తెలిపారు. ఫిబ్రవరి 12న కోట జంక్షన్ నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. సమావేశంలో శంకర్రావు, ఎ.జగన్మోహనరావు, బి.రమణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


