ఉగాదికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: ఉగాది పండుగ నాటికి జిల్లాలో మంజూరైన అన్ని గృహాల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మండల స్థాయి అధికారులకు వారం వారీ లక్ష్యాలను నిర్దేశించామని, ఇకపై ప్రతి వారం గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నిర్ణయించిన లక్ష్యాలను విధిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండల స్థాయి అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో హౌసింగ్ పథకాల పురోగతిని సమీక్షించారు. కొన్ని మండలాల్లో గృహ నిర్మాణాల పురోగతి సంతృప్తికరంగా ఉండగా మరికొన్ని మండలాలు వెనుకబడి ఉన్నాయని పేర్కొని సంబంధిత అధికారులు వేగం పెంచాలని సూచించారు. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్ తదితర నిర్మాణాలకు అవసరమైన మౌలిక వసతులపై ఎంపీడీఓలు హౌసింగ్ పీడీకి నోటు పెట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో కూడా కౌన్సిలర్లతో సమన్వయం చేసుకొని గృహనిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గృహనిర్మాణాల రోజువారీ పురోగతి నివేదికలను తనకు సమర్పించాలని హౌసింగ్ పీడీకి కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ గండి మురళీమోహన్, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, మండల ప్రత్యేకాధికారులు, మండల అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ డీఈలు, ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
సవరించిన పాస్ పుస్తకాలు ఫిబ్రవరిలో పంపిణీ
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో ఉన్న తప్పులను సరి చేయడానికి తహసీల్దార్ల లాగిన్‌లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చామని కలెక్టర్ తెలిపారు. తప్పులు సరిచేసిన తరువాత పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తహశీల్దార్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలను వెరిఫికేషన్ చేసి, లోపాలను సవరించి ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు.


