నేడు రామతీర్థంలో శ్రీరామచంద్రస్వామి కల్యాణం
● ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థాన
అధికారులు
● స్వామి కల్యాణానికి వైభవంగా
ధ్వజారోహణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానం మరో వేడుకకు ముస్తాబైంది. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, దీక్షాధారణ, అంకురారోపణం, అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ, తదితర కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామి కల్యాణ ఘట్టంలో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం జరిపించారు. వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపైకి గరుత్మంతుడి చిత్రపఠాన్ని ఎగుర వేసి సమస్త దేవతా మూర్తులను స్వామి కల్యాణానికి ఆహ్వానం పలికారు.
నేడు స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవం
స్వామి సన్నిధిలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం గురువారం వైభవంగా జరగనుంది. ఉదయం 8 గంటలకు ఆలయంలో శ్రీమద్రామాయణ పారాయణం, వేద పఠనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి మూడు వాహనాలు(హంస, హస్వ, గరుడ) వాహనాల్లో స్వామి వారు రామతీర్థం పుర వీధుల్లో ఊరేగనున్నారు. కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ వీధిలో ఎదుర సన్నాహా మహోత్సవాన్ని జరిపిస్తారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను దేవాలయానికి తీసుకువచ్చి స్వామి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభిస్తారు. సరిగ్గా రాత్రి 10 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చి దిద్దారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై గణేష్ తెలిపారు.
నేడు రామతీర్థంలో శ్రీరామచంద్రస్వామి కల్యాణం


